‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'

22 Nov, 2021 15:38 IST|Sakshi
విలపిస్తున్న చిన్నారులు శ్యామల, బిందు

తల్లిదండ్రుల మృతితో దీనంగా విలపించిన కుమార్తెలు

చిన్నారులను చూసి కన్నీరు పెట్టిన గ్రామస్తులు

సింగారంలో విషాద ఛాయలు

‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్ముల్ని ఎవరు చూస్తారు అంటూ చిన్నారులు శ్యామల, బిందు విలపించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. కరెంట్‌ రూపంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కుండ చేత పట్టి అంతిమయాత్ర ముగిసే వరకు అమ్మనాన్నలను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగారు. అన్నీ తామై తల్లిదండ్రులకు తలకొరివి పెట్టారు. తమకు దిక్కెవరు అని గుండెలు బాదుకుంటుండగా బంధువులు, గ్రామస్తులు వారిని ఓదార్చుతూనే కన్నీటి పర్యంతమయ్యారు’. 

సాక్షి, బయ్యారం: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వచ్చిన కొడుకుతో పాటు కోడలును కరెంట్‌ కబలించింది. మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధి సింగారం కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్‌ తన భార్య తిరుపతమ్మతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్యామల, బిందు ఉన్నారు. ఇటీవల ఉపేందర్‌ తండ్రి వెంకులు కాలు విరిగింది. అతడిని చూసేందుకు వచ్చిన ఉపేందర్‌ దంపతులను కరెంట్‌ ప్రవహిస్తున్న దండెం బలి తీసుకుంది. కాగా వారి అంతిమ యాత్రలో కుమార్తెలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. 

చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!)

నాడు ప్రేమలో.. నేడు చావులో..
కాలనీకి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ ప్రేమతో పెళ్లికి సిద్ధపడగా ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విద్యుత్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నాడు ప్రేమలో ఒకటైన వారు నేడు ఒకటిగా మృతి చెందారని అంటూ స్థానికులు కంటతడి పెట్టారు.

తల కొరివిపెట్టిన చిన్నారులు.. 
విద్యుదాఘాతంతో మృతి చెందిన తల్లికి చిన్నకుమార్తె బిందు, తండ్రికి పెద్దకుమార్తె శ్యామల తలకొరివి పెట్టారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు పెద్ద బాధ్యతను మోయడం చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

చదవండి: (నెల రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..)

ప్రభుత్వపరంగా ఆదుకుంటాం..
విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎంపీ కవిత, అదనపు కలెక్టర్‌ కొమరయ్య అన్నారు.  అదనపు కలెక్టర్‌ సింగారం కాలనీకి వెళ్లి  పిల్లలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో తహసీల్దార్‌ నాగభవాని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు