సెప్టిక్‌ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లతో ప్రాణాలు పోతున్నాయ్‌.. అయినా!

30 Nov, 2021 07:30 IST|Sakshi

వీటిలోకి దిగి మృత్యువాత పడుతున్న కార్మికులు

నైపుణ్య శిక్షణ కొరవడటంతోనే అనర్థాలు

చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలు

గచ్చిబౌలి ఘటనతోనైనా అప్రమత్తత అవసరం

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో సెప్టిక్‌ ట్యాంకులు, మురుగు నీటిపైపులైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు కార్మికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. నైపుణ్య శిక్షణ లేని కార్మికులను కొందరు ప్రైవేటు యజమానులు, కాంట్రాక్టర్లు వీటిల్లోకి దించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. సంబంధిత యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో  అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన దుర్ఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌కాలేజీ ఆఫ్‌ ఇండియా.. జలమండలి సౌజన్యంతో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు భద్రతను కల్పిస్తూ.. వారిలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు విధిగా ఈ శిక్షణ పొందాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 
 
కార్మికులకు ప్రాణ సంకటం.. 
మహానగరం పరిధిలో సుమారు ఏడువేల కిలోమీటర్ల పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై 2.5 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటితోపాటు శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ నెట్‌వర్క్‌ లేకపోవడంతో లక్షలాది గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల్లో సెప్టిక్‌ ట్యాంకులను నిర్మించుకున్నారు. మురుగు సమస్యలు తలెత్తిన ప్రతిసారీ వీటిని శుద్ధి చేయడం, ఖాళీ చేసే పనుల్లో పాలుపంచుకుంటున్న కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో ప్రమాదకరమైన మీథేన్‌ విషవాయువు పేరుకుపోవడంతో అందులోకి దిగినవారు ఊపిరాడక మరణిస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా సాంకేతికత ఆధారంగా వీటి శుద్ధికి ప్రాధాన్యమివ్వాలని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన విషయం విదితమే. 
చదవండి: ‘కేంద్రం’ కొనదట..కొనుగోలు కేంద్రాలుండవ్‌

శిక్షణలో ముఖ్యాంశాలు..  
► జలమండలి నుంచి లైసెన్సు పొందిన కాంట్రాక్టర్లు మాత్రమే నైపుణ్య శిక్షణ పొందిన కార్మికుల ఆధ్వర్యంలో సెప్టిక్‌ ట్యాంకులను శుద్ధి చేయాలి. వీటిలోకి దిగే కార్మికులకు సంబంధింత కాంట్రాక్టరు.. భద్రత ఉపకరణాలు ఎయిర్‌ కంప్రెసర్లు, ఎయిర్‌లైన్‌ బ్రీతింగ్‌ పరికరాలు, గ్యాస్‌ మాస్క్, ఆక్సిజన్‌ సిలిండర్‌ విధిగా ఉండాలి. 
► అత్యవసర మెడికల్‌ ఆక్సిజన్‌ కిట్‌ అందుబాటులో ఉంచాలి. నైలాన్‌ రోప్‌ ల్యాడర్, రిఫ్లెక్టింగ్‌ జాకెట్, నైలాన్‌ సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ హ్యామ్స్, సేఫ్టీ ట్రైపాడ్‌ సెట్, సెర్చ్‌లైట్, సేఫ్టీ టార్చ్, పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కిట్లను అందజేయాలి. 

►ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సెప్టిక్‌ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన ప్రమాదకర వాయువులను గుర్తించే గ్యాస్‌ మానిటర్‌ వినియోగించాలి. దీంతో ఏ స్థాయిలో వాయువులున్నాయో తెలుసుకోవచ్చు. క్లోరిన్‌ మాస్కులు అందుబాటులో ఉంచాలి. 
సెప్టిక్‌ ట్యాంకులను జలమండలి కాల్‌సెంటర్‌ 155313/14420కు కాల్‌చేసి శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకోసారి సెప్టిక్‌ ట్యాంకును శుభ్రం 
చేసుకోవడం తప్పనిసరి.
చదవండి: ఊపిరి పణంగా.. ఉద్యమం ఉధృతంగా..  

>
మరిన్ని వార్తలు