మోదీని కలవనున్న బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు.. పీఎం ఏం చెబుతారో?  

7 Jun, 2022 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది. జీహెచ్‌ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లు 47 మంది ఉన్నారు. వీరిలో కొందరు సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు మంగళవారం వెళ్లనున్నారు. ఇటీవల ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం నగరానికి వచ్చినప్పుడే కలవాలనుకున్నప్పటికీ.. గాలిదుమారం, వర్షం కారణంగా సమయం కుదరలేదని ఓ కార్పొరేటర్‌ తెలిపారు. ఆ రోజు కలవలేకపోవడంతో మంగళవారం ఢిల్లీలో కలిసేందుకు అవకాశం కల్పించారన్నారు.

రాబోయే వివిధ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి నుంచే పార్టీని పటిష్టం చేసేందుకు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయగలరనే అభిప్రాయాలున్నాయి. జీహెచ్‌ఎంసీలో స్థానికంగా కార్పొరేటర్లదే కీలకపాత్ర కావడం తెలిసిందే. ప్రజల స్థానిక సమస్యలు వారికే బాగా తెలుస్తాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేదీ కార్పొరేటర్లే అయినందున, వారి సేవల్ని తగిన విధంగా వినియోగించుకోవడం ద్వారా అటు ప్రజలకు తగిన మేలు చేయడంతో పాటు ఇటు పార్టీ బలోపేతానికీ అవకాశముంటుందని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు పీఎంను కలవనుండటం.. జీహె చ్‌ఎంసీకి సంబంధించి ఏం చెప్పనున్నారనేది బీజేపీ శ్రేణుల్లో  ఉత్కంఠ కలిగిస్తోంది.
చదవండి: జూబ్లీహిల్స్‌ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

మరిన్ని వార్తలు