ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పగలు, ప్రతీకారంతో రగులుతున్న రాజకీయాలు

17 Aug, 2022 18:11 IST|Sakshi
తెల్దారుపల్లిలోని కోటేశ్వరరావు ఇంట్లో ధ్వంసమైన సామగ్రి 

సాక్షి, ఖమ్మం : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పగ.. ప్రతీకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం రగులుతోంది. తెల్దార్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నేత కృష్ణయ్య హత్యతో రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. చాలా కాలం తర్వాత జిల్లాలో రాజకీయ హత్య జరగడం చర్చకు దారితీసింది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే నేతలు, కేడర్‌ మధ్య వైరం నివ్వురు గప్పిన నిప్పులా ఉంది. మరోపక్క పల్లెల్లో టీఆర్‌ఎస్, ప్రత్యర్థి పార్టీల నేతలు నువ్వా, నేనా అన్నట్లుగా రాజకీయం చేస్తున్న నేపథ్యాన ఇప్పుడు హత్య జరగడంతో కలకం మొదలైంది.

అతిసమస్యాత్మకంగా పాలేరు..
ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన పాలేరు నియోజకవర్గం ఇటీవల అతిసమస్యాత్మకంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యాన ఈ నియోజకవర్గంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచర వర్గాలు రెండుగా చీలాయి. ఈ నియోజకవర్గంలో వారంలో ఒకటి, రెండు సార్లు ఏదో ఒక చోట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతుండడం గమనార్హం.

గ్రామ స్థాయి నుంచి మండల కేంద్రం వరకు రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దార్‌పల్లిలో తుమ్మల అనుచర నేత కృష్ణయ్య దారుణ హత్యతో తుమ్మల వర్గం విషాదంలో మునిగిపోయింది. సీపీఎం పార్టీకి చెందిన నేతలే ఆయనను చంపారని కృష్ణయ్య భార్యతో పాటు కూతురు, కుమారుడు ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో తుమ్మల వర్గానికి.. కందాల వర్గంతో పాటు సీపీఎం మరో ప్రత్యర్థిగా మారిందని రాజకీయ చర్చజరుగుతోంది.  

ఘర్షణలు .. గలాట
పాలేరుతో పాటు వైరా, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లోనూ ఇటీవల టీఆర్‌ఎస్‌లో గలాట శృతి మించుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అనుచర వర్గాలు ఘర్షణలకు పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే తమపై కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యేల అనుచరులు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.

ఇటీవల మంత్రి కేటీఆర్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముందు కూడా ఈ ఘర్షణలు, కేసులు విషయమై అంతర్గతంగా జరిగిన సమీక్షలో ఒకరిద్దరు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. అంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్‌ ఆదేశించినా అది అప్పటికే పరిమితమైంది. ప్రధాన నేతలు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉండగా ఇదే స్థాయిలో అనుచర నేతల్లోనూ వైరం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ ఘర్షణల వరకు వెళ్తోంది. ఎన్నికల నాటికి రాజకీయ వ్యూహాలు, పరిణామాలు మారే అవకాశం ఉన్నా గులాబీ గూటిలో జరుగుతున్న అంతర్‌‘యుద్ధం’ భయానకంగా మారుతుందనే ప్రచారం సాగుతోంది. 

ఎందాకైనా తెగిస్తూ..
ప్రధాన నేతల మధ్య వైరం ఒక స్థాయిలో ఉంటే.. గ్రామ స్థాయి నేతల మధ్య మాత్రం ఎంతకైనా తెగించే పరిస్థితులకు దారితీస్తోంది. స్థానికంగా, వ్యక్తిగతంగా నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు గ్రామంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారితే తమ ఉనికి విషయంలోనూ అదే జరుగుతుందనే ఉద్దేశంతో వైరి వర్గం, పార్టీపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడం నిత్యకృత్యమైంది.

ఇలా నేతలు.. తమ వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఉనికిని కాపాడుకునేందకు చేస్తున్న రాజకీయంతో ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలు అతిసమస్యాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్ది కొన్నిప్రాంతాల్లో  జరుగుతున్న ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తరించడం గమనార్హం. ప్రధాన నేతల మధ్య వైరం చల్లారితేనే.. గ్రామ, మండల స్థాయిలోని వారి అనుచరులు మధ్య ఘర్షణలకు బ్రేక్‌ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు