యాదాద్రీశుడికి శాస్త్రోక్త పూజలు

7 Sep, 2020 09:59 IST|Sakshi
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు 

సాక్షి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే ఆలయాన్ని తెరచిన అర్చక స్వాములు శ్రీస్వామి వారికి సుప్రభాతం చేపట్టారు. అనంతరం అర్చనలు, అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేశారు. మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుకను నిర్వహించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు మహానివేదన, శయనోత్సవం నిర్వహించారు. ఆన్‌లైన్‌ పూజల ద్వారా శ్రీస్వామి వారి నిత్య కల్యాణం, అభిషేకాల్లో భక్తులు పేర్లు నమోదు చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. 

ఆలయ వేళల్లో మార్పులు..
యాదగిరిగుట్ట పట్టణంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరోసారి ఆలయ పూజలు, దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా పాత పద్ధతిలో పూజలు, దర్శనాల మార్పులు చేసిన ఆలయ అధికారులు, వాటిని మరోసారి కుదిస్తూ మార్పులు చేశారు. స్థానిక ప్రజలు, ఆలయ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 

ఆలయ వేళలు ఇలా..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయాన్ని ఉదయం 5.30 గంటలకు తెరిచి, ఉదయం 5.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ, ఉదయం 6గంటల నుంచి 6.30గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు శ్రీస్వామి వారికి బాలబోగం, 7.15గంటల నుంచి 8.15 గంటల వరకు అభిషేకం. 8.15 గంటల నుంచి 9గంటల వరకు సహస్త్ర నామార్చన, ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉచిత లఘు దర్శనం, మధ్యాహ్నం 12గంటల నుంచి 12.45గంటలకు శ్రీస్వామి వారికి మహా రాజబోగం (ఆరగింపు), మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు ఉచిత లఘు దర్శనం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు శ్రీస్వామి వారికి ఆరాధన, రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల వరకు సహస్త్ర నామార్చన, రాత్రి 7.30 నుంచి రాత్రి 8గంటల వరకు నివేదన, అనంతరం ఆలయ ద్వార బంధనం చేయనున్నట్లు ఈఓ తెలిపారు.

ఇదిలా ఉండగా ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు శ్రీస్వామి వారి సుదర్శన నారసింహ హోమం, ఉదయం 10.30 గంటల నుంచి 11.30గంటల వరకు శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం, సాయంత్రం 5గంటలకు శ్రీస్వామి వారి జోడు సేవలు దేవస్థానం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఈ విధంగానే ఉండనున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు