మాకొద్దీ పెంపు, 61 ఏళ్ల వరకు పనిచేయలేం!

7 Apr, 2021 03:28 IST|Sakshi

పాత పద్ధతినే కోరుతున్న చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు

రిటైర్మెంట్‌కు దగ్గర పడిన వారిలో అనారోగ్య సమస్యలు

వేరే విధులు అప్పగించాలని ఇప్పటికే వేల మంది వినతి

తాజాగా మరో ఏడాది రిటైర్మెంట్‌ వయసు పెంపుతో ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యం సహకరించట్లేదు. అందువల్ల డ్యూటీలు చేయలేకపోతున్నాం. మాకు ఇతర విధులుంటే అప్పగించండి. లేదా నిర్బంధ పదవీ విరమణకు అవకాశం కల్పించండి. ఇవీ దాదాపు 2 వేల మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పెట్టుకున్న వినతులు. ఇలాంటి అభిప్రాయంతో మరికొన్ని వేల మంది కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆర్టీసీలో మాత్రం సంబరాలు లేవు. సిబ్బందిలో ఎక్కువ మంది తమకు పాత పద్ధతే కావాలని కోరుతున్నారు. రిటైర్మెంట్‌కు చేరువయ్యేకొద్దీ ఒంట్లో శక్తి సన్నగిల్లి, కష్టతరమైన డ్రైవర్, శ్రామిక్, కండక్టర్‌ డ్యూటీలు చేయలేక కూలబడుతున్న ఉద్యోగులు ఆర్టీసీలో ఎందరో.

ఈ మూడు కేటగిరీల్లో పనిచేసే వారిలో మరణాల రేటూ ఎక్కువగానే ఉంటోంది. ఏటా ఆర్టీసీలో ఇలా రిటైర్మెంట్‌లోపే దాదాపు 175–200 మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల వరకు ఉద్యోగం చేయాల్సి రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాత పద్ధతిలో 58 ఏళ్లకే రిటైరయ్యేలా ఆప్షన్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రభుత్వం ముం దు ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు. 

రెండేళ్లుగా పదవీ విరమణల్లేవు.. 
ఆర్టీసీలో ప్రస్తుతం 48,600 మంది ఉద్యోగులున్నారు. సంస్థలో ఏటా సగటున 2,200 మంది రిటైరవుతుంటారు. కానీ గత రెండేళ్లుగా సంస్థలో పదవీ విరమణల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీలోనూ గతంలో రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్లుగానే ఉండేది. కానీ 2019లో సిబ్బంది చేపట్టిన సమ్మె అనంతరం ప్రభుత్వం ఆర్టీసీలో రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచింది. దీంతో గత రెండేళ్లుగా సంస్థలో రిటైర్మెంట్లు లేవు. డిసెంబర్‌ నుంచి మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కానున్నాయి. దీన్నే చాలా మంది కార్మికులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పెంపును ఆరోగ్య సమస్యలు లేనివారు స్వాగతించినప్పటికీ ఎక్కువ మంది మలి దశలో కష్టతరమైన విధులు నిర్వర్తించలేక ఇబ్బంది పడుతున్నారు.

ఫలితంగా తమకు డ్రైవింగ్‌కు బదులు వేరే బాధ్యతలు అప్పగించాలని డ్రైవర్లు, నిలబడి డ్యూటీ చేయలేనందున కౌంటర్‌లో కూర్చునే డ్యూటీ ఇవ్వాలని కండక్టర్లు, గ్యారేజీలో బరువు పనులు చేయలేకపోతున్నందున సెక్యూరిటీ లాంటి ఇతర విధులు ఇవ్వాలని శ్రామిక్‌లు కోరుతూ వస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించాలనే ఒత్తిడి అప్పట్లోనే తెచ్చారు. సమ్మె సమయంలో అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు. ఏ వయసుకు ఎందరు వీఆర్‌ఎస్‌ తీసుకుంటే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కలతో సహా సమర్పించారు. అయితే ఆర్టీసీ పరిస్థితి తీసుకట్టుగా ఉండటంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెరగడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పాత పద్ధతిలోనే రిటైర్మెంట్‌కు అవకాశం కల్పించి సెటిల్మెంట్‌ చేస్తే విశ్రాంతి తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపాదన ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
      
‘61’కి మేం వ్యతిరేకం
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు, ఆర్టీసీ కార్మికుల పని ఒత్తిడికి చాలా తేడా ఉంటుంది. రిటైర్మెంట్‌ వయసు దగ్గర పడేసరికి డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పనిచేయలేరు. బలవంతంగా పనిచేస్తే రిటైరయ్యేలోపు చనిపోతున్నవారెందరో. ఇప్పుడు ఆర్టీసీలో పని ఒత్తిడి ఇంకా పెరిగి చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో వారికి త్వరగా విశ్రాంతి అవసరం. రిటైర్మెంట్‌ వయసు 61కి పెంచితే వారికి కష్టమే. అందుకే కొత్త విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కనీసం స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించాలి 
– కమల్‌రెడ్డి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు