చంద్రుడిపై  వచ్చే ఏడాది కార్ల రేసు..

2 Dec, 2020 08:39 IST|Sakshi

రెండు కార్లను పంపనున్న మూన్‌ మార్క్‌ కంపెనీ 

వాటిని తయారు చేయనున్న హైస్కూల్‌ విద్యార్థులు 

రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో నిర్వహణకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జాబిల్లిపై కార్ల రేస్‌ జరగబోతోంది! మన చందమామపై కార్లు రయ్‌ రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. ఇందుకోసం అమెరికా హైస్కూల్‌ విద్యార్థులు రెండు కార్లను డిజైన్‌ చేయనున్నారు! మన జాబిల్లిపైకి మనుషులింకా అడుగుపెట్టలేదు కానీ అంతరిక్ష పరిశోధనల కారణంగా బోలెడన్ని వాహనాలైతే వెళ్లాయి. రిమోట్‌ కంట్రోలర్ల సాయంతో వాటిని భూమి మీద నుంచే నడిపించినట్లే.. 2021 అక్టోబర్‌లో నిర్వహించనున్న కార్ల రేసు కూడా అలాగే జరుగుతుందట. ఈ రేసులో పాల్గొనే కార్ల సైజు మాత్రం చాలా చిన్నది. భూమ్మీద ఒక్కో కారు బరువు 2.5 కిలోలు ఉంటే చంద్రుడి పై వాటిని దించేందుకు ఉపయోగించే వ్యవస్థ బరువు ఇంకో 3 కిలోలు ఉంటుంది.

రేసులో పాల్గొనేది రెండు కార్లు కాబట్టి మొత్తం ఐదు కిలోలు, దించే వ్యవస్థ మూడు కిలోలు కలుపుకొంటే మొత్తం 8 కిలోల బరువును జాబిల్లికి చేర్చాలన్నమాట. ఈ చిన్న బరువును అక్కడికి తీసు కెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుంది. స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన నోవా–సీ ల్యాండర్‌ ద్వారా జాబిల్లిపైకి చేరనుంది. జాబిల్లిపైకి ఓషియన్‌ ప్రోసె ల్లారమ్‌ ప్రాంతంలో దిగే నోవా–సీ ముందుగా ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా సర్వే చేసిన తర్వాతే వాటిని దించుతుంది.

లైవ్‌లో కారు రేసు..
ఈ కార్ల రేసును లైవ్‌లో ప్రసారం చేయా లని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్‌ కంపెనీ భావిస్తోంది. మూన్‌ మార్క్‌ మిషన్‌–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్‌ విద్యార్థుల బృందాలతో కార్ల డిజైన్‌ చేయిస్తారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేయ డం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో టాడ్‌ వాలాచ్‌ ‘న్యూ అట్లాస్‌’తో చెప్పారు. భూమి నుంచి అక్కడకి సమాచారం కాంతి వేగంతో ప్రయాణించినా సంకేతం వెళ్లేందుకు 1.3 సెకన్ల సమయం పడుతుంది.

ట్రాక్‌ మాటేమిటి?
ఇక్కడైతే కార్ల రేసులన్నీ తారురోడ్లపై నడుస్తాయి. మరి జాబిల్లిపైని కారు రేసు? ఇందుకు ఫ్రాంక్‌ స్టీఫెన్‌సన్‌ అనే రేసు కారు డ్రైవర్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, జాబిల్లిపై మట్టి ధర్మాలను పరిగణనలోకి తీసుకుని అక్కడే నిర్మిస్తారని కంపెనీ చెబుతున్నా.. వాస్తవానికి ఇది జాబిల్లి మట్టిపైనే జరుగుతుందని అంచనా. అయితే ఈ రేసు నిర్వహణకు కావాల్సిన భారీ మొత్తాన్ని రేసు వీడియోలను ప్రపంచమంతా పంపిణీ చేయడం ద్వారా ఆర్జిస్తామని మూన్‌మార్క్‌ చెబుతోంది. కానీ.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు సందేహాలూ కలుగుతున్నాయి. ఇది అసాధ్యమనే వారూ లేకపోలేదు. స్పేస్‌ ఎక్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు సహకరిస్తే గానీ ఇది సాధ్యం కాదని కొందరు నిపుణులు పెదవి విరుస్తున్నారు. మూన్‌మార్క్‌ మాత్రం అన్ని ప్రశ్నలకూ కాలమే సమాధానం చెబుతుందని.. 2021 అక్టోబర్‌ వరకు వేచి చూడాలని చెబుతోంది.  

మరిన్ని వార్తలు