మండలిలో ఏడు ఖాళీలు.

28 Dec, 2022 02:46 IST|Sakshi

మే నెలలోగా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ విరమణ 

ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు.. టీచర్స్‌ కోటాలో కాటేపల్లి కాలపరిమితి పూర్తి 

గవర్నర్‌ కోటాలో ఫారూక్‌ హుస్సేన్, రాజేశ్వర్‌.. లోకల్‌ బాడీ నుంచి ఎంఐఎం జాఫ్రీ కూడా.. 

ఖాళీలపై ఔత్సాహికుల ఆసక్తి 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మే నెలలోగా శాసనమండలిలో ఏడుగురు సభ్యులు రిటైర్‌కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్‌ కోటాలో ఇద్దరు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో ఒక్కో సభ్యుడు చొప్పున తమ ఆరేళ్ల పదవీ కాలపరిమితిని పూర్తి చేసుకోనున్నారు. వివిధ కోటాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో అవకాశం కోసం పలువురు ఔత్సాహికులు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.

వచ్చే ఏడాది చివరలో శాసనసభకు ఎన్నికలు జరగనుండగా.. ఆ లోపే మండలిలో ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కె.నవీన్‌కుమార్, వి.గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డిల పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన ఫారూఖ్‌ హుస్సేన్, డి.రాజేశ్వర్‌రావు, హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ మహ్మద్‌ అమీనుల్‌ జాఫ్రీలు మే 27న రిటైర్‌అవుతారు. జనార్ధన్‌రెడ్డి ‘హైదరాబాద్‌–రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ఉపాధ్యాయ కోటా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న జనార్ధన్‌రెడ్డి మరోమారు బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

 స్థానిక కోటాలో ఎంఐఎం 
బీఆర్‌ఎస్‌తో అవగాహనలో భాగంగా గతంలో హైదరాబాద్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎంఐఎం నుంచి అమీనుల్‌ జాఫ్రీ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలోనూ ఈ స్థానాన్ని ఎంఐఎంకు అప్పగించడమా లేక పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడమా అనే అంశంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ సభ్యులున్న ఎంఐఎంకే తిరిగి అప్పగించే అవకాశ మున్నట్లు సమాచారం. గవర్నర్‌ కోటాలో మైనారిటీ వర్గానికి చెందిన రాజేశ్వర్, ఫారూక్‌ హుస్సేన్‌ పదవీ విరమణ చేయనుండగా, ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ కేసీఆర్‌ అవకాశమిచ్చే సూచనలు ఉన్నాయి.

కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌కుమార్‌కు రెండో పర్యాయం దక్కనుండగా వి.గంగాధర్‌ గౌడ్‌ స్థానంలో కొత్తవారిని అదృష్టం వరించే అవకాశముంది. గతంలో బీజేపీలోకి వెళ్లి సొంతగూటికి తిరిగి వచ్చిన మండలి మాజీ చైర్మన్‌ వి.స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి కేసీఆర్‌ అవకాశమిస్తారని సమాచారం.   

మరిన్ని వార్తలు