రెవె‘న్యూ’ ప్రాబ్లమ్‌!  

25 May, 2023 01:05 IST|Sakshi

వీఆర్‌ఏలను ఇతర శాఖలకు పంపితే గ్రామాల్లో సేవలకు ఆటంకం

ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ రద్దు.. వీఆర్‌ఏలూ లేకుంటే ఇబ్బందేనంటున్న అధికారులు 

56 రకాల రెవెన్యూ విధులతో పాటు అన్ని శాఖల్లోనూ ‘సహాయకుల’ ముఖ్యపాత్ర 

నేర విచారణ నుంచి పంట నష్టం 

అంచనాల దాకా ప్రాథమిక సమాచారం ఇచ్చేది వారే 

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ కీలకమే.. 

సాక్షి, హైదరాబాద్‌: వీఆర్‌ఏ.. గ్రామ రెవెన్యూ సహాయకుడు.. పేరుకే రెవెన్యూ ఉద్యోగి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాల్లోనూ భాగస్వామ్యం ఉంటుంది. వీఆర్‌ఏలు అంటే గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి లాంటి వారనే అభిప్రాయమూ ఉందంటే వారిదెంతటి కీలక పాత్రో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేశాక.. వీఆర్‌ఏలే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఏకైక దిక్కుగా మిగిలారు.

అలాంటి వీఆర్‌ఏల సేవలు గ్రామాల్లో అవసరం లేదని, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గందరగోళానికి దారితీస్తోంది. వీఆర్‌ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వారిని ఇతర శాఖలకు పంపితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వీఆర్‌ఏల విధులెన్నో.. 
వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరి జాబ్‌చార్ట్‌ మాత్రం మిగతా ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లోని చెరువులు, కుంటల సంరక్షణతో పాటు ఏ చెరువు కట్ట తెగినా, వాగులు పొంగినా, అలుగులు పోసినా నీటిపారుదల శాఖ ఏఈ, డీఈలకు వీఆర్‌ఏలే ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. గతంలో అయితే నీటి పంపకం (తైబందీ) కూడా వీరి పర్యవేక్షణలోనే జరిగేది.

ఇక, గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాట్లు చేసేది, గ్రామంలోకి ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా దగ్గరుండి గ్రామానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది వీఆర్‌ఏలే. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత కూడా వీరిదే. పదో తరగతి నుంచి అన్ని స్థాయిల్లోని పరీక్షలకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తుంటారు.

ప్రకృతి విపత్తులు, పంట నష్టం, శాంతిభద్రతలు, అగ్నిప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం కోసం వీఆర్‌ఏలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల (పోలింగ్‌) ప్రక్రియలో సైతం తెరవెనుక పనిచేస్తుంటారు. పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు నుంచి ఆయా స్టేషన్లలో వసతుల కల్పన, పోల్‌ స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌ బాక్సుల పర్యవేక్షణ (స్ట్రాంగ్‌ రూంలకు తరలించేంతవరకు) చేసేది వీఆర్‌ఏలే.  

గ్రామాల్లో ‘ప్రభుత్వ ప్రతినిధి‘! 
ఇక గ్రామాల్లో హత్యలు జరిగినప్పుడు, గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినప్పుడు, దోపిడీలు, ఆత్మహత్యల్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీఆర్‌ఏలే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిస్తారు. గంజాయి రవాణా, స్మగ్లింగ్‌ లాంటి ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉండేలా పోలీసులు నిర్వహించే పంచనామాలో సాక్షులుగా (పంచ్‌) వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. వీటితో పాటు 56 రకాల రెవెన్యూ విధులను వీరు నిర్వహిస్తుంటారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉండే వ్యక్తి వీఆర్‌ఏ. అలాంటి వీఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి పంపిస్తే రెవెన్యూ శాఖ పునాదులు కదలడం ఖాయమని, ఆ వ్యవస్థ మనుగడే కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర శాఖలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

వీరి నిష్క్రమణ కారణంగా ఎదురయ్యే సమస్యలకు గ్రామస్థాయిలో పరిష్కారమే ఉండదని అంటున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిని.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై మౌనం పాటిస్తున్నారు. 

వారు వెళితే కష్టమే.. 
వీఆర్‌ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే వారికి పేస్కేల్‌ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలా కాకుండా వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసే వారుండరు. రెవెన్యూ పాలనే కాదు.. ఇతర శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు కూడా కష్టతరమవుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
– కె.గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
 
వీఆర్‌ఏలకు సంబంధించిన గణాంకాలివీ.. 
రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు: 10,416 
మొత్తం వీఆర్‌ఏ పోస్టుల సంఖ్య: 23,046 
విధుల్లో ఉన్న వీఆర్‌ఏలు: 21,434 
డిగ్రీ, ఆపైన చదువుకున్నవారు: 2,909 
ఇంటర్‌ విద్యార్హతలున్నవారు: 2,343 
పదో తరగతి చదివినవారు: 3,756 
పదో తరగతిలోపు చదువుకున్నవారు: 7,200 
నిరక్షరాస్యులు: 5,226  

విద్యార్హతలపై కిరికిరి? 
► ఇతర శాఖలకు పంపే మాట అటుంచితే కేబినెట్‌ ఆమోదించిన విధంగా వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిని క్రమబద్ధీకరించే  విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు చాలామందిని పేస్కేల్‌ నుంచి దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్‌ఏలలో కేవలం 9,008 మందికి మాత్రమే 10వ తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్నాయి.

మిగిలిన 12,426 మంది వీఆర్‌ఏలు పదో తరగతి కన్నా తక్కువ చదువుకోగా, వీరిలో 5వేల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఒకవేళ విద్యార్హతలే క్రమబద్ధీకరణకు ప్రామాణికమైతే తగిన విద్యార్హతలు లేని వీఆర్‌ఏల కుటుంబాల్లో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వాలని వీఆర్‌ఏల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ రెవెన్యూ వర్గాలు మాత్రం.. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న మెజారిటీ వీఆర్‌ఏల విషయంలో ఏం నిర్ణయం తీసుకునేదీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు