Secunderabad Railway Station Updates: సాఫీగా రైలు కూత!

19 Jun, 2022 02:08 IST|Sakshi
శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ

ప్రశాంతంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 

చాలా వరకు యథాతథంగా నడిచిన రైళ్లు 

ఇతర ప్రాంతాల్లో అవాంతరాలతో కొన్నింటి రద్దు 

సాధారణంగానే ప్రయాణికుల రద్దీ 

విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు పరిహారం చెల్లిస్తామన్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్‌ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్‌ఏఎఫ్‌ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతిస్తున్నారు. 

మరికొద్ది రోజులు ఇబ్బందులు 
శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు.

ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 

పార్శిళ్లకు నష్ట పరిహారం 
ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్‌ను బుకింగ్‌ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. 

వేగంగా మరమ్మతులు.. 
ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్‌లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. 

రద్దయిన, షెడ్యూల్‌ మారిన రైళ్లు ఇవీ.. 
► భువనేశ్వర్‌–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్‌–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్‌–సికింద్రాబాద్‌ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. 
► ఆదివారం సికింద్రాబాద్‌–షాలిమార్‌ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్‌ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్‌–దానాపూ ర్, సికింద్రాబాద్‌–రాజ్‌కోట్, సికింద్రాబాద్‌–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సమయా లను రీషెడ్యూల్‌ చేసి నడుపుతున్నారు. 

నేడూ ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు 
సికింద్రాబాద్‌ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు