అడుగు పడింది

8 Apr, 2021 12:38 IST|Sakshi

సిద్దిపేట బల్దియా పోరుకు సిద్ధం 

ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 

పూర్తయిన వార్డుల పునర్విభజన 

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు 

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 

సిద్దిపేట బల్దియా పోరుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన పూర్తైన విషయం తెలిసిందే. రెండో ఘట్టంగా కుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఈ నెల 14లోగా పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని సూచించింది. – సిద్దిపేటజోన్‌

వార్డుల వారిగా ఓటరు తుది జాబితా ఈనెల 11లోగా విడుదల చేయాలని, అదేవిధంగా వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ఈనెల 14లోగా ప్రచురించాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాబితా అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఈనెల 12లోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అవసరమైన సిబ్బంది నియమాలను, సామగ్రి, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌పేపర్ల ముద్రణ, ఇండెలిబుల్‌ ఇంక్‌ తదితర ఏర్పాట్లు చూడాలని ఈసీ సూచించింది.   

త్వరలో పరిశీలకుల నియామకం 
సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో గతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ప్రస్తుత అవసరమైన కేంద్రాల సంఖ్య సరిపోల్చి వాడుకోవాలని సూచనలు చేసింది. బ్యాలెట్‌ బాక్స్‌లు అవసరమైన మేరకు వాటిని తయారు చేసి సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. వార్డ్‌ వారీగా బ్యాలెట్‌ పేపర్లను అంచనా వేసుకొని ముద్రణ కోసం ప్రింటింగ్‌ ప్రెస్‌లను గుర్తించాలని ఆదేశించింది. సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచి కోడ్‌ అమలులో ఉంటుందని, సాధారణ, వ్యయ పరిశీలకులను త్వరలో నియమిస్తామని కమిషన్‌ పేర్కొంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఈసీ సూచనలు చేసింది.   

పోలింగ్‌ కేంద్రాల నోటిఫికేషన్‌ 
సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎన్నికల  కమిషన్‌ పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ సెక్రటరీ అశోక్‌కుమార్‌ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.  
ఏప్రిల్‌ 8న పోలింగ్‌ కేంద్రాల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ 
8 నుంచి 11వ తేదీ వరకు ఫిర్యాదుల స్వీకరణ  
9న రాజకీయ పార్టీల సమావేశం 
12న ఫిర్యాదుల పరిష్కారం 
14న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా 

సిద్ధంగా ఉన్నాం 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాం. షెడ్యూల్‌ మేరకు ఒక్కో ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఎన్నికల నిర్వహణ కోసం అవరసమైన సిబ్బంది, అధికారుల నియామకాలను కలెక్టర్‌ అనుమతితో చేపడుతాం. 
– రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌  
 

మరిన్ని వార్తలు