సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!

4 Oct, 2020 03:36 IST|Sakshi
హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ శ్రీధర్‌ 

గతేడాది కన్నా తగ్గిన లాభాలు 

తేలని కార్మికుల వాటా 

దసరా ముందే ఇప్పిస్తామంటున్న టీబీజీకేఎస్‌ 

గోదావరిఖని: అసలే కరోనా వైరస్‌.. మార్చి నెల వేతనంలో 50 శాతం కోత.. పెరిగిన ఖర్చులు.. పెండింగ్‌ బకాయిల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తుందా లేదా అన్న ఉత్కఠకు తెరపడింది. 2019–20 ఆర్థిక   సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ లాభాలు ఆరు నెలల తర్వాత యాజమాన్యం తేల్చినట్లు సమాచారం. రూ.993 కోట్లు సంస్థకు లాభాలు వచ్చినట్లు తెలిసింది.   హైదరాబాద్‌లో శనివారం జరిగిన బోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో లాభాలు తేల్చినట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఇరవై ఏళ్ల క్రితం లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు ప్రారంభమైంది. సంస్థ నష్టాల్లో ఉన్న కాలంలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఏఐటీయూసీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఇలా 1999లో మొదలైన కార్మికుల లాభాల వాటా పంపిణీ నేటికీ కొనసాగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ రూ.1,766 కోట్ల లాభాలను యాజమాన్యం ప్రకటించింది. అందులో కార్మికుల వాటా   28 శాతం వాటా చెల్లించింది. ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్ష వరకు లాభాల బోనస్‌ అందింది.  

ఈసారి భారీగా తగ్గిన లాభాలు 
సింగరేణిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో లాభాలు భారీగా తగ్గాయి. ఈసారి రూ.993 కోట్లుగా చెబుతున్నారు. గతేడాది ఇదే లాభాల వాటా రూ.1766 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే సగానికి తగ్గినట్లుగా తెలుస్తోంది. కార్మికులకు చెల్లించే బోనస్‌ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.  

35 శాతం వాటాకు డిమాండ్‌ 
గతేడాది సింగరేణి సాధించిన లాభాల్లో 28 శాతం కార్మికుల వాటా యాజమాన్యం చెల్లించగా, ఈసారి 35 శాతం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈసారి లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించారు. లాభాల వాటా ప్రకటన ముఖ్యమంత్రి పరిధిలో ఉండటంతో గుర్తింపు పొందిన యూనియన్‌ టీబీజీకేఎస్‌ నేతలు కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలసి సీఎంను కలవాలని చూస్తున్నారు. 

23న లాభాల వాటా ఇప్పిస్తాం
కార్మికులకు లాభాల వాటా ఈ నెల 23న ఇప్పిస్తాం. మార్చిలో నిలిపివేసిన సగం వేతనం కూడా ఇదే రోజున చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కోవిడ్‌తో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఇప్పిస్తాం. దీనికి యాజమాన్యం అంగీకరించింది. త్వరలో కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి లాభాల వాటాపై చర్చిస్తాం. – బి.వెంకట్రావ్, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు  

మార్చి వేతనంతో లాభాల వాటా చెల్లించాలి 
సింగరేణి లాభాల్లో ఈసారి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. కోవిడ్‌ నేపథ్యంలో గత మార్చిలో కార్మికుల వేతనంలో కోత విధించిన 50 శాతం కూడా ఈ నెలలో చెల్లించాలి. దసరా ఆదివారం వస్తున్నందున కార్మికులు నష్టపోకుండా పండుగకు ముందే లాభాల వాటా చెల్లించేలా చూడాలి. – కెంగర్ల మల్లయ్య, బీఎంఎస్‌ అధ్యక్షుడు

లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి 
సంస్థ లాభాలు రూ.993 కోట్లుగా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తేల్చిన నేపథ్యంలో అందులో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. మార్చిలో కోత విధించిన 50 శాతం వేతనం కూడా లాభాల వాటాతో కలిపి ఇవ్వాలి. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైంది. కార్మికులకు ఇబ్బంది కలుగకుండా యాజమాన్యం వెంటనే చెల్లించేలా చూడాలి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా