‘సీటు’ మార్పుపై సీనియర్ల నజర్‌! 

19 Jun, 2022 00:44 IST|Sakshi

తమ నియోజకవర్గాలను వదిలి మరోచోట పోటీకి పలువురు కాంగ్రెస్‌ నేతల ఆలోచన 

అధిష్టానానికి ప్రతిపాదనలు.. సన్నిహితులతో చర్చలు 

గెలుపు అవకాశాల కోసం కొందరు.. 

వారసులను తెరపైకి తెచ్చేందుకు మరికొందరి ప్రయత్నాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల్లో కొందరు తాము పోటీ చేసే నియోజకవర్గాలను మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం, గతంలో ప్రాతినిధ్యం వహించిన వాటికి బదులు కొత్త స్థానాల్లో పోటీపై ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఆ దిశగా పార్టీ రాష్ట్ర నాయకత్వం వద్ద, తమ సన్నిహితుల వద్ద ప్రతిపాదన పెడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సహా పలువురు సీనియర్‌ నేతలూ ఈ జాబితాలో ఉన్నారు.

కొందరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, తమ వ్యక్తిగత చరిష్మా, కలిసి వచ్చే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఎక్కడి నుంచి బరిలో ఉంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. మరికొందరు తమ వారసుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తమ స్థానాలను వదులుకునేందుకు, అవసరమైతే లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

జాబితాలో సీనియర్‌ నేతలు.. 
►పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆందోల్‌ నుంచి కాకుండా జహీరాబాద్‌ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు పార్టీ ముందు ప్రతిపాదన పెట్టారని సమాచారం. ఇటీవల ఆయన జహీరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే జహీరాబాద్‌ మాజీ మంత్రి గీతారెడ్డి నియోజకవర్గం కావడం, తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని అంటుండటంతో లొల్లి మొదలైంది. దీనితో గీతారెడ్డిని కంటోన్మెంట్‌ స్థానం నుంచి పోటీకి దింపాలని దామోదర ప్రతిపాదిస్తున్నారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

►ఇక పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి తాను ఈసారి జడ్చర్ల బరిలో ఉండనని.. అసెంబ్లీకి అయితే కంటోన్మెంట్‌ నుంచి, లోక్‌సభకు అయితే నాగర్‌కర్నూల్‌కు పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్తున్నారు. 

►పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ కూడా నిజామాబాద్‌ లోక్‌సభకు కాకుండా.. అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. 

►పార్టీ నేత జానారెడ్డి నాగార్జునసాగర్‌ను తన కుమారుడు రఘువీర్‌కు అప్పగించి.. తాను నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 

►ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసారి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారవడంతో జానారెడ్డికి లైన్‌ క్లియర్‌ కావొచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

►ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ కూడా తన కుమారుడు దీపక్‌ ప్రజ్ఞను తెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీపక్‌ను ఆలంపూర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయించి తాను నాగర్‌కర్నూల్‌ ఎంపీగా బరిలో ఉండాలని సంపత్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

►ఈసారి తనకు పాలకుర్తి కాకుండా జనగామ లేదా వరంగల్‌ (వెస్ట్‌) ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి కోరుతుండగా.. తాను పరకాల నుంచి కాకుండా వరంగల్‌ (ఈస్ట్‌) నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి సురేఖ చెప్తున్నారు. 

►భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తన సొంత నియోజకవర్గం ములుగు టికెట్‌ తనకే ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. 

►వీరితో పాటు పలు జిల్లాల్లో ఈ అసెంబ్లీ స్థానాల మార్పు ప్రతిపాదనలు వస్తుండటంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే నివేదికలు కూడా సునీల్‌ కనుగోలు తయారు చేస్తున్నారని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఊపు తేవాలా.. అక్కడే ఉండాలా? 
జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తాను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందన్న దానిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. తాను కొడంగల్‌ను వదిలి ఎల్బీనగర్‌లో పోటీచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది.

తాను ఎల్బీనగర్‌లో పోటీ చేయడం ద్వారా హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పార్టీకి ఓ ఇమేజ్‌ వస్తుందని.. ఇక్కడ ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయవచ్చని రేవంత్‌ యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే కొడంగల్‌లో తన సోదరుడు తిరుపతిరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉందనే చర్చ రేవంత్‌ శిబిరంలో జరుగుతోంది.   

మరిన్ని వార్తలు