అన్నదాత కష్టాలు..తడిసి మోపెడు

17 May, 2021 01:30 IST|Sakshi

ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతన్న

కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు

అకాల వర్షాలతో ఉక్కిరిబిక్కిరి రాత్రికి కుప్పలు, పొద్దంతా ఆరబెట్టడానికే సరిపోతున్న సమయం

తేమ, తాలు పేరిట తరుగుతో తీవ్ర నష్టాలు.. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదంటున్న రైతులు

ఈ ఫొటోలోని రైతు పేరు మట్టు యాదయ్య. ఈయనది నల్లగొండ జిల్లా జి.చెన్నారం గ్రామం. ఈ యాసంగిలో పండిన 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ఏప్రిల్‌ 10న అమ్మకానికి తీసుకువచ్చాడు. ధాన్యంపై కప్పేందుకు 20 పట్టాలు అద్దెకు తీసుకున్నాడు. ఒక్కో పట్టాకు రోజుకు రూ.20 అద్దె. ఇలా రోజుకు రూ.400 అద్దె కడుతున్నాడు. ఇప్పటికి 37 రోజుల వుతోంది. తేమ శాతం చూసి పెట్టారు. కానీ కొనడం లేదు. ఈయన కంటే ముందు 50 మంది రైతులు ఉన్నారు. వారం దరివీ కొన్న తరువాతనే కొంటామని చెప్పడంతో కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నాడు. పట్టాల అద్దె ఇప్పటివరకు రూ.14 వేలకు పైగా చెల్లించాడు. ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే ఇన్ని కష్టాలా? ఏం చేయాలో పాలు పోవడం లేదు..’అంటూ యాదయ్య వాపోతున్నాడు.    

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఎన్న డూ లేనంతగా జరిగిన యాసంగి పంటల సాగు సంబురం రైతుల కళ్లల్లో ఏమాత్రం కన్పించడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేయడం ఒక ఎల్తైతే, పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు అష్ట కష్టాలూ పడుతున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, సేకరించిన తర్వాత రవాణాకు వాహనాలు లభించక ధాన్యాన్ని తరలించలేని పరిస్థితులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విధించిన కఠిన నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, ఇవి చాలదన్నట్టుగా ముంచుకొచ్చిన తుపాను.. వెరసి రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. మరో పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి వానాకాలం మొదలుకానున్నా.. ఇంతవరకు యాభై శాతం ధాన్యం సేకరణ కూడా పూర్తి కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

 

లక్ష్యం చేరని సేకరణ 
ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందన్న ప్రకటనలో జరిగిన జాప్యం మొదలు.. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, అన్నీ కలిసి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చురుగ్గా ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కనీసంగా 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో 94.81 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు ప్రణాళిక వేశారు. ఇందుకోసం 7,204 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, 6,700 కేంద్రాలను తెరిచారు. వీటి ద్వారా సుమారు 2 లక్షలకు పైగా రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరించారు.

మరో 54 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 40 రోజులుగా సాగుతున్న సేకరణలో రోజుకు లక్ష టన్నుల మేర సేకరణ జరుగుతోంది. ఈ లెక్కన మిగతా సేకరణకు మరో నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతుండగా, జూన్‌లో మళ్లీ వర్షాలు మొదలైతే ధాన్యాన్ని అమ్ముకోవడం మరింత కష్టతరం కానుంది. పూర్తిస్థాయిలో వర్షాలు మొదలైతే పెట్టుబడి కూడా దక్కక తాము అప్పులపాలు కావాల్సిందేనని రైతులు అంటున్నారు. 

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి 
జగిత్యాల జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు గాను ఇంతవరకు 2.50 లక్షల టన్నులు, నిజామాబాద్‌లో 8 లక్షల టన్నులకు గాను 5 లక్షల టన్నులు, ఖమ్మంలో 4.5 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు, యాదాద్రిలో 4.7 లక్షల టన్నులకు గాను 1.9 లక్షల టన్నులు, సిద్దిపేటలో 5.46 లక్షల టన్నులకు గాను 1.6 లక్షల టన్నుల ధాన్యం సేకరణే జరిగింది. ఈ జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది.  

తరుగు పేరిట గొరిగేస్తున్నారు.. 
మరోవైపు ఎఫ్‌సీఐ నిబంధనలంటూ పౌర సరఫరాల శాఖ నాణ్యత విషయంలో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తేమ 17 శాతం మించకుండా చూసుకోవడంతో పాటు తాలు.. చెత్త ఒక శాతం, మట్టి పెడ్డలు, రాళ్లు ఒక శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా పరిపక్వత చెందని ధాన్యం 3 శాతానికి మించి ఉండకూడదన్న ఎఫ్‌సీఐ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. దీంతో నాణ్యత లేని ధాన్యాన్ని కేంద్రాల్లో తూకం వేయడం లేదు.

ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యంలో తేమ 20 శాతానికి పైగానే ఉంటోంది. దీన్ని పగలంతా ఆరబెట్టి రాత్రికి కుప్పలు చేస్తే, మళ్లీ వర్షం పడటంతో తేమ శాతం మళ్లీ పెరుగుతోంది. చాలా చోట్ల టార్పాలిన్‌ల కొరత రైతుల్ని వేధిస్తోంది. రోజుకు రూ.20 చొప్పున నాలుగైదు టార్పాలిన్లు అద్దెకు తెచ్చి కుప్పలను కప్పుతున్నా తేమ శాతం తగ్గకపోవడం, ధాన్యం రంగుమారడం జరుగుతోంది. ఎలాగో ధాన్యాన్ని తూకం వేసినా క్వింటాల్‌కు కనీసంగా తరుగు పేరిట నాలుగు నుంచి 5 కిలోలు తీసేస్తున్నారు. మిల్లు వద్ద నాణ్యత పేరిట మరో రెండు కిలోలు తరుగు తీస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

వేధిస్తున్న వాహనాల సమస్య 
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన మేర లారీలు, డీసీఎంలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకేసారి పంట కోతకు రావడం, కుప్పలుగా ధాన్యం కేంద్రాలకు రావడంతో అక్కడి నుంచి కేంద్రానికి కేటాయించిన ఐదారు లారీల ద్వారా తరలింపు ఆలస్యమవుతోంది. బిహార్, యూపీలకు చెందిన హమాలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కరోనా కారణంగా స్థానిక కూలీలెవరూ పనికి ముందుకు రాకపోవడంతో లోడింVŠ  ప్రక్రియ జాప్యం అవుతోంది. ఇక మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లోనూ సమస్య ఎదురవుతోంది. దీంతో మిల్లుల వద్ద వాహనాలు బారులు కడుతున్నాయి. దీన్ని నివారించేందుకు స్థానికంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవాలని చెబుతున్నా, లాక్‌డౌన్‌ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 తర్వాత పెట్రోల్‌ బంకులు మూసి వేస్తుండటంతో వాహనాలు సమకూర్చేందుకు యజమానులు ముందుకు రావట్లేదు.

లారీలు వస్తలేవంటున్నరు 
మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి ఊరిలోనే కేంద్రానికి తీసుకొస్తే పది రోజులు అవుతున్నా కొంటలేరు. అడిగితే లారీలు వస్తలేవంటున్నరు. వానొస్తే ధాన్యం తడిచిపోతాది. టార్పాలిన్లు అడిగితే ఇస్తలేరు. నేనే బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చిన. తొందరగా కొనేటట్టు చూడాలె. 
– మల్లేశం, చాట్లపల్లి, సిద్దిపేట జిల్లా 

తాలు పేరుతో దోచుకుంటున్నారు..  
రెండెకరాల్లో పండిన 40 క్వింటాళ్ల ధాన్యాన్ని మందపల్లి పీఏసీఎస్‌ కేంద్రానికి 10 రోజుల క్రితం తీసుకువచ్చాను. కుప్పలు పోసి ప్యాడీ క్లీనర్లు తూర్పారబట్టిన తర్వాత ఆరు రోజులకు గన్నీ సంచులు ఇచ్చారు. తర్వాత రెండ్రోజులకు కాంటా పెట్టిండ్రు. తూర్పారపట్టినా కూడా మిల్లు వాడు నలభై కిలోల బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తీసుకున్నాడు. మొత్తం మీద నాకు క్వింటాకు 5 కిలోల తరుగు నష్టం జరిగింది.  
– అజ్మీర్‌ రాములు, రాజ్యాతండా, దుగ్గొండి మండలం, వరంగల్‌ రూరల్‌ జిల్లా

40 రోజులుగా పడిగాపులు 
నా పొలంలో 320 బస్తాల వడ్ల దిగుబడి వచ్చింది. అమ్ముదా మని కూసుమంచిలోని కొనుగోలు కేంద్రానికి 40 రోజుల కిందట తీసుకొచ్చిన. ఇప్పటివరకు 170 బస్తాలు కాంటా వేశారు. 150 బస్తాలు మిగిలే ఉన్నాయి. కాంటా వేసిన ధాన్యం ఎగుమతి కాలేదు. కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా. వర్షాలు, గాలిదుమారాలు వస్తుంటే భయంగా ఉంది. ధాన్యం తడిస్తే రంగు మారిందని తరుగు తీస్తున్నారు.  
– వడ్త్యి నాగేశ్వరరావు, గంగ బండతండా, ఖమ్మం జిల్లా

  • ఈ ఫొటోలోని రైతు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన నరెడ్ల అంజిరెడ్డి. 3 ఎకరాల్లో వరి సాగుచేస్తే దాదాపు 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ఆరు ట్రాక్టర్లలో తరలించాడు. కానీ అక్కడ ధాన్యం ఆరబోయడానికి వసతులు లేవు. టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో లేకపోవడంతో 10 టార్పాలిన్‌ కవర్లు అద్దెకు తీసుకువచ్చాడు. ఇంత చేసినా వర్షం కురవడంతో రంగు మారిపోయింది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అంటున్నాడు.
  • ఈమె పేరు ఎల్లోబోయిన సమ్మక్క (జనగామ జిల్లా చీటకోడూరు గ్రామం). ఐదున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. 120 బస్తాల దిగుబడి వచ్చింది. జనగామలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌కు 11 రోజుల కింద తీసుకొచ్చారు. అకాల వర్షాలకు రెండుసార్లు ధాన్యం తడిసిపోయింది. ధాన్యం ఆరబోసేందుకు రోజుకు రూ.వెయ్యి ఖర్చయ్యింది.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు నిమ్మల జయపాల్‌రెడ్డి రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. అకాల వర్షానికి తడిసి ధాన్యం రంగు మారింది. మిల్లర్ల వద్దకు చేరిస్తే క్వింటాకు 7.30 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగును రైతులు అంగీకరిస్తేనే కొనుగోలు జరుగుతోందని చెప్పాడు. 
  • వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామానికి చెందిన పెంటప్ప 15 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోశాక గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు వసతులు లేకపోవడంతో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్‌ వద్ద రైస్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొత్తం 900 ధాన్యం బస్తాలను తరలించాడు. కానీ అక్కడి నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉందని, క్వింటాలుకు 10 కిలోల తరుగు తీసి వేస్తామని చెప్పడంతో ధాన్యం బస్తాలను తిరిగి గ్రామానికి తీసుకొని వెళ్లాడు. రైస్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం అధికార పార్టీకి చెందిన మండల ప్రజా ప్రతినిధిది కావటం గమనార్హం.  

  • ఈయన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు. పేరు వెంకట్రామిరెడ్డి. తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. 210 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు అమ్ముకుందామనే ఉద్దేశంతో స్థానిక పీఏసీఎస్‌ సెంటర్‌కు తీసుకొచ్చి విక్రయించాడు. అయితే ధాన్యం సేకరించి రెండు మూడు రోజులు గడిచినా లారీల కొరతతో కేంద్రం సిబ్బంది ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేదు. వర్ష సూచన, ధాన్యంపై కప్పడానికి టార్పలిన్‌ కవర్లు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాకు రూ.20 చెల్లించి ప్రైవేట్‌ వాహనాలలో మిల్లు వద్దకు తరలించారు. ఇంతా చేస్తే అక్కడ ధాన్యం దించడానికి వారం సమయం పట్టింది.

    వాహనాల యజమానులు వెయిటింగ్‌ చార్జీ కింద రోజుకు రూ.400 వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు బస్తా బరువు కలుపుకొని 40.600 గ్రాములు తూకం వేయాలి. కానీ తరుగు, తేమ అంటూ మిల్లర్ల పేరిట కొనుగోలు సెంటర్‌లోనే బస్తాకు అదనంగా 600 గ్రాములు చొప్పున క్వింటాల్‌కు కిలోకు పైగానే ధాన్యం తరుగు తీశారు. తర్వాత లారీల కొరత, రైసుమిల్లులో ధాన్యం దించడానికి వెయిటింగ్‌ ఇలా వారం నుండి పది రోజులు çసమయం గడవడంతో గింజ బరువు తగ్గి తూకంలో తేడా వచ్చింది. దీంతో మిల్లర్లు మళ్ళీ కిలోకు పైగా ధాన్యం తరుగు తీశారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి వాపోయాడు. రెండున్నర ఎకరాలు పంట సాగుకు దాదాపు రూ.80 వేలు, ధాన్యం రవాణా ఖర్చు రూ.6 వేలు అయ్యిందని, ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు పెట్టుబడికే సరిపోయి నట్టయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.  

  • ధాన్యం రవాణాకు సరిపడినన్ని లారీలు, ఇతర వాహనాలు లేక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో వేచి చూడాల్సి వస్తోంది. 
  • వర్షాలతో తేమ 17 శాతం మించకుండా చూడటం కష్టమవుతోంది. 
  • ఈ తేమ తగ్గేందుకు ఆరబెడుతున్నా, మళ్లీ వర్షాలు వస్తుండటంతో మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది.
  • ఈ క్రమంలో ధాన్యం రంగుమారినా, ఆరబెట్టే క్రమంలో పెళ్లలు వచ్చినా క్వింటాల్‌కు 3–4 కిలోలు తరుగు పోతోంది.
  • మిల్లుల్లోనూ కోత పెడుతున్నారు. వాస్తవానికి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లాక రైతుకు సంబంధం ఉండొద్దు. కానీ అక్కడ నాణ్యతను సాకుగా చూపి మొత్తం తూకంలో మళ్లీ కోత వేస్తున్నారు.
  • హమాలీల కొరతతో కేంద్రాల వద్ద లోడింగ్, మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
  • టార్పాలిన్లు, మిల్లుల వద్ద వెయిటింగ్‌ చార్జీలు తడిసి మోపెడవుతు న్నాయి. ఒక్క టార్పాలిన్‌కు రూ.20 వరకు అద్దె ఉంటోంది. ఒక రైతుకు కనీసం పది టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. 
మరిన్ని వార్తలు