ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?

2 Mar, 2023 04:46 IST|Sakshi

ప్రీతి ఆత్మహత్య ఘటనపై తొలగని అనుమానాలు 

కౌన్సెలింగ్‌కు ముందు సహచరులను మద్దతు అడిగినా ఎందుకివ్వలేదు? 

అప్పుడు సైఫ్‌కు ఎందుకు మద్దతిచ్చారు? 

కౌన్సెలింగ్‌లో తప్పు ఒప్పుకున్న సైఫ్‌ను ఎందుకు వెనకేసుకొచ్చారు? 

కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు 

సాక్షి, వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్‌ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. 

రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే... 
గత డిసెంబర్‌లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్‌ వైర్‌ విషయంలో సైఫ్‌ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్‌ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్‌ఓడీ లేదంటే జీఎంహెచ్‌ ఇన్‌చార్జికి ఫిర్యాదు చేయ్‌’ అని సైఫ్‌కు పర్సనల్‌ వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్‌ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్‌ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. 

హెచ్‌ఓడీకి సైఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది.  

 ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్‌ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. 

 ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్‌ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్‌ స్టూడెంట్‌ డాక్టర్‌ భీమని మనీశ్, థర్డ్‌ ఇయర్‌ హౌస్‌ సర్జన్‌ డాక్టర్‌ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్‌ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్‌ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్‌ రూహి, డాక్టర్‌ భీమని మనీశ్‌ చికిత్స 
అందించారు. 


తేలాల్సినవెన్నో... 
సైఫ్‌ వేధింపుల గురించి ప్రీతి క్లాస్‌మెట్స్, సీనియర్‌ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్‌మేట్‌ అనూషకు వాట్సాప్‌ ద్వారా ప్రీతికి సపోర్ట్‌ చేయొద్దంటూ సైఫ్‌ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్‌ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్‌కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. 
 ప్రీతి కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్‌ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్‌ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్‌ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్‌లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు?  
ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్‌ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు