డ్రైంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు | Sakshi
Sakshi News home page

డ్రైంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు

Published Fri, Nov 10 2023 5:36 AM

-

నిర్మల్‌ రూరల్‌: మద్యం తాగి పట్టుబడిన వ్యక్తికి మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పు చెప్పినట్లు రూరల్‌ ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... మండలంలోని లంగ్డాపూర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా వేంగాపేట్‌ గ్రామానికి చెందిన తలారి శంకర్‌ మద్యం తాగి పట్టుబడ్డాడు. గురువారం కోర్టులో హాజరుపరచగా అతడికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అజీజ్‌ రెహమాన్‌ తీర్పు చెప్పాడు.

వైద్యురాలిని వేధించిన ముగ్గురికి ఏడాది జైలు

మంచిర్యాలక్రైం: వైద్యురాలిని వేధించిన కేసులో ముగ్గురు యువకులకు ఏడాది జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కే.ప్రభాకరరావ్‌ గురువారం తీర్పునిచ్చినట్లు సీఐ రాజు తెలిపారు. కాలేజ్‌రోడ్‌ గర్మిళ్లకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యురాలిని అదే ప్రాంతానికి చెందిన అట్లా సంతోష్‌, మాటేటి శ్రావణ్‌, అందే అశోక్‌ కొంతకాలంగా వెంబడించేవారు. 2018 మే 27న నైట్‌ డ్యూటీకి వెళ్తుండగా ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెంబడించి వేధింపులకు గురిచేయడంతో 2018 మే 30న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో రెండో అదనపు కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీంతో నిందితులు జిల్లా కోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. జిల్లా న్యాయమూర్తి ప్రభాకరరావ్‌ కేసును విచారించిన అనంతరం నిందితుల అప్పీల్‌ను కొట్టివేస్తూ అదేతీర్పును ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.

రైలు కిందపడి ఒకరు మృతి

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌): రవీంద్రఖని–మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య క్యాతనపల్లి రైల్వేగేటు సమీపంలో గురువారం గుర్తు తెలియని వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందినట్లు మంచిర్యాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌ తెలిపారు. మృతుని వయస్సు 65 నుంచి 70 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా? తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement