క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌.. 20 శాతం కమీషన్‌.. టెకీ నుంచి రూ.22 లక్షలు స్వాహా

2 Nov, 2022 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రిప్టో కరెన్సీలో మీరు చేసిన ట్రేడ్‌కు లాభాలు వచ్చాయి. ఆ లాభాలు మీకు చెందాలంటే మాకు 20శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనంటూ సైబర్‌ కేటుగాళ్లు నగరానికి చెందిన ఓ టెకీకి వల వేశారు. మొదట్లో 208 యూఎస్‌డీ డాలర్లు(రూ.17వేలకు పైగా మన కరెన్సీలో) క్రిప్టో కొనిపించారు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయంటూ నమ్మించి నిండా ముంచేశారు. తనని గుర్తు తెలియని వారు మోసం చేశారంటూ హబ్సిగూడకు చెందిన యేగేశ్‌ శర్మ మంగళవారం సిటీసైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్న యేగేశ్‌ శర్మ ఫోన్‌ నంబర్‌ను టెలిగ్రామ్‌ గ్రూప్‌లో గుర్తుతెలియని వ్యక్తి యాడ్‌ చేశాడు. ఈ గ్రూప్‌లో అంతా క్రిప్టో లాభాలపై చర్చ, లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌షాట్స్‌తో ఫొటోలు కనిపించాయి. గ్రూప్‌లో ఓ వ్యక్తి యేగేశ్‌శర్మతో మాట కలిపాడు. కేకో కాయిన్‌ డాట్‌కామ్‌ అనే లింకును పంపి ఆ లింకులో రిజిస్టర్‌ అయ్యాక మొదట్లో 208 ఎస్‌డీ డాలర్ల క్రిప్టో కొనుగోలు చేశాడు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయని చెప్పిన కేటుగాడు 20శాతం కమీషన్‌ ఇస్తేనే మీ లాభాలు మీ కొచ్చేలా చేస్తామన్నారు.

దీనికి సరేనంటూ కేటుగాళ్లు చెప్పిన విధంగా యూఎస్, యూకే డాలర్లను క్రిప్టో పేరుతో కొనుగోలు చేయిస్తూనే ఉన్నారు. యేగేశ్‌శర్మకు ఇవ్వాల్సిన లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా వారు చెప్పిన విధంగా రూ.22 లక్షలు సమర్పించాడు. అంతటితో ఆగక మరో రూ.1.50 లక్ష క్రిప్టో కొనుగోలు చేసి తాము చెప్పిన అకౌంట్‌ నంబర్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు