రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం 

12 Apr, 2022 02:01 IST|Sakshi
హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ప్రవీణ్‌ కుమార్‌   

బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌  

హుజూర్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్‌ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్‌ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు