నిధుల విడుదలపై నివేదిక ఇవ్వండి

9 Dec, 2021 01:43 IST|Sakshi

 రాష్ట్ర ప్రభుత్వంపై మళ్లీ ఈసీ ఆగ్రహం 

జిల్లా, మండల పరిషత్‌లకు రూ.250 కోట్ల నిధుల వ్యవహారం

పంచాయతీరాజ్‌ శాఖకు సీఈఓ నోటీసులు 

పట్టణ ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఇప్పటికే మందలింపు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టణ ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఇప్పటికే తీవ్రంగా మందలించిన ఈసీ.. జిల్లా, మండల పరిషత్‌లకు రూ.250 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన (పీఆర్‌అండ్‌ఆర్‌ఈ) శాఖ కమిషనర్‌ ఎ.శరత్‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై తక్షణమే విచారణ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్‌ గోయల్‌ను ఆదేశించింది.

దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను తాజాగా సీఈఓ ఆదేశించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేవరకు పకడ్బందీగా ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను కోరారు. ఏదైనా మినహాయింపులు అవసరమైతే స్పష్టమైన కారణాలు సూచిస్తూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేస్తూ ఈ నెల 3న పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తప్పుబడుతూ టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాల్సి ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేయడానికే ఈ నిధులు విడుదల చేసినట్టు ఆయన ఆరోపించారు.      

వారికి వార్నింగ్‌ ఇచ్చి రికార్డు చేయండి 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన వ్యవహారంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డిపై సీఈసీ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. వారికి హెచ్చరికలు జారీ చేసి వాటిని ‘రికార్డు’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

ఉద్యోగుల సర్వీసు బుక్స్‌లో ఇలాంటి రిమార్క్‌లను నమోదు చేస్తే కెరీర్‌లో మచ్చగా మిగిలిపోవడంతో పాటు కొన్ని రకాల ప్రయోజనాలకు అడ్డంకిగా మారతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌ పర్సన్లు, డిప్యూటీ చైర్‌ పర్సన్లు, వార్డు సభ్యులు, కో–ఆప్షన్‌ సభ్యుల గౌరవ వేతనాలు, రవాణా భత్యాన్ని 30 శాతం పెంచుతూ గత నెల 19న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ మరుసటి రోజే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీనిపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. 

మరిన్ని వార్తలు