కేఆర్‌ఎంబీకి  తెలంగాణ లేఖ 

10 Sep, 2021 01:40 IST|Sakshi

తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి జలాల తరలింపు ఆపేయాలని వినతి  

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్‌) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ మురళీధర్, కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు.

1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్‌ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్‌సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. 

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్‌ రెగ్యులేటర్‌కు మాత్రమే అనుమతించింది.  
ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు.  
అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు.  
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి.  
గెజిట్‌ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్‌ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్‌ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి.  
శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్‌ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్‌ పరిగణించింది.  
19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు