జూన్, జూలైల్లో ఉచిత బియ్యం! 

24 May, 2021 05:23 IST|Sakshi

కేంద్ర కోటాను కలుపుకొని ఒక్కొక్కరికీ పది కిలోలు 

పేదలకు ఆహార కొరత తీర్చడమే లక్ష్యం 

2.80 కోట్ల మందికి లబ్ధి..    రాష్ట్ర ప్రభుత్వంపై రూ.400 కోట్ల భారం 

సాక్షి, హైదరాబాద్‌: జూన్, జూలైల్లో ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధిలేక ఇంటి పట్టునే ఉంటున్న పేదలకు ఆహార కొరత లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రకటించిన ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. కేంద్రం అందిస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి అదనంగా రాష్ట్ర కోటా కింద మరో 5 కిలోలు కలిపి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 

రాష్ట్రంపై నెలకు రూ.200 కోట్ల మేర భారం 
దేశవ్యాప్తంగా కేంద్ర ఆహార చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని కేంద్రం ఇదివరకే తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర చట్టం పరిధిలోకి వచ్చేవారు 1.91 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరికి అవసరమయ్యే 93 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. రాష్ట్ర చట్టం పరిధిలోకి వచ్చే 90 లక్షల మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తం 2.80 కోట్ల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అదనంగా ఇచ్చే బియ్యం కోటాతో ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.400 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

జూన్‌కు అవసరమయ్యే బియ్యం కోటాను 25వ తేదీ నాటికి రేషన్‌ షాపులకు ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, తమను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించడంతోపాటు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, అందరికీ ఇన్సూరెన్స్‌ చేయించాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో జూన్‌లో బియ్యం పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నారు. వీరి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయం మేరకు బియ్యం పంపిణీ ఆధారపడి ఉంది.   

మరిన్ని వార్తలు