1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్‌

26 Apr, 2021 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. 1 తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుగా మంత్రి సబితా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆ తెల్లారే సోమవారం విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  వేసవి సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయగా తాజాగా ప్రాథమిక నుంచి ఉన్నత విద్య (1నుంచి 9వ తరగతి) విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే విద్యాలయాలన్నీ మూసివేయగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కరోనా కట్టడి చర్యలు తీసుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 

చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
చదవండి: మాస్క్‌ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌

మరిన్ని వార్తలు