‘బయోమెట్రిక్‌’ లెక్కనే జీతాలు!

29 May, 2022 00:48 IST|Sakshi

హాజరు సరిగాలేని వారిపై వైద్యారోగ్య శాఖ దృష్టి 

నల్లగొండ మెడికల్‌ కాలేజీలో 57 మంది డాక్టర్లకు నోటీసులు 

పలు జిల్లా ఆస్పత్రుల్లో సిబ్బందికి కూడా తాఖీదులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వైద్యులు నిత్యం ఆస్పత్రులకు వచ్చేలా, సకాలంలో హాజరయ్యేలా చూడాలని.. జీతాలు ఇవ్వాలంటే బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బయోమెట్రిక్‌ హాజరు సరిగా లేని వైద్యులు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తోంది.     

ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నా.. 
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థలు ఉన్నప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. వైద్యులు, సిబ్బంది కూడా బయోమెట్రిక్‌ను పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల సదరు పరికరాలను పాడుచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక నుంచి ఏరియా, జిల్లా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లోనూ బయోమెట్రిక్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, బయోమెట్రిక్‌ హాజరు ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. ఎక్కడైనా వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకాకున్నా, చెప్పాపెట్టకుండా గైర్హాజరైనా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని కరీంనగర్, గజ్వేల్‌లలోని జిల్లా ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు సకాలంలో హాజరుకాకపోవడంతో కమిషనర్‌ అజయ్‌కుమార్‌ నోటీసులు జారీచేశారు.

నల్లగొండ మెడికల్‌ కాలేజీలో 57 మంది అధ్యాపకులకు కూడా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. కక్షగట్టి నోటీసులు ఇచ్చారని ఆందోళన చేయడంతో చివరికి నోటీసులను వెనక్కు తీసుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక సూపరింటెండెంట్లు, కాలేజీల ప్రిన్సిపాల్‌లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. 

ఆకస్మిక తనిఖీలు కూడా.. 
పేదలకు వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్నిచోట్లా మెరుగైన వసతులు కల్పిస్తూనే, వైద్యులు, సిబ్బంది సరిగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించింది. వైద్యులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని సంబంధిత అధిపతులకు సూచించింది. ‘‘ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులు జిల్లాలకు వెళ్లాలి.

ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. సకాలంలో హాజరుకాని వారిపైనా, అనధికారిక గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి’’ అని ఇటీవల వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తున్నారు. వచ్చిన రెండు నెలల్లోనే వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ 20 జిల్లాల్లో పర్యటించారు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 8 గంటలకే ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఉన్నతాధికారుల తనిఖీలతో వైద్య సిబ్బందిలో భయం నెలకొందని అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా వరుసగా జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులపై సమీక్ష చేస్తున్నారు. మొత్తం అన్ని ఆస్పత్రులపైనా నెలవారీ సమీక్ష కేలండర్‌ చేపట్టి.. వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్న వైద్యు లు, దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు మాత్రం బయోమెట్రిక్‌ హాజరుపై ఆగ్రహంగా ఉన్నారని వైద్యారోగ్య సిబ్బంది చెప్తున్నారు.   

మరిన్ని వార్తలు