చెరువుల్లో జల సవ్వడి

18 Sep, 2020 04:13 IST|Sakshi

43 వేలకుగాను 30 వేల చెరువులు ఫుల్‌.. రాష్ట్రంలో తొలిసారి 

మరో 4 వేలకు పైగా చెరువుల్లో సగంకన్నా ఎక్కువగానే నీరు 

ప్రస్తుత వర్షాలతో మరిన్ని నిండే అవకాశం 

యాసంగి పంటలకు నీటి కరువు తప్పినట్లే.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన రెండు నెలలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో చెరువులు నిండుతున్నాయి. ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే 13వేలకు పైగా చెరువులు పొంగిపొర్లుతుండగా, మరో 17వేల చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరిన్ని రోజులు వర్షాల ప్రభావం ఉండటంతో మిగతా చెరువులు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది.  గోదావరి బేసిన్‌Sచెరువులన్నీ జల సవ్వడిని సంతరించుకున్నాయి. బేసిన్‌లో మొత్తం 20,111 చెరువులుండగా 6,630 అలుగుపారుతున్నాయి. మరో 10,900 చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 2,669, వరంగల్‌ జిల్లాలో 1,259 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఉన్న మరో 5 వేలకు పైగా చెరువులు పూర్తిగా నిండి ఉండగా, ఏ క్షణమైనా మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో 3,800, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 2వేల చెరువుల చొప్పున పూర్తిగా నిండాయి.

ఇక కృష్ణా బేసిన్‌ లో 23,301 చెరువులకు గానూ 6,500 ఉప్పొంగుతుండగా, మరో 5,900 చెరువులు వంద శాతం నిండి ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 3,390 చెరువులు అలుగుపారుతుండగా, మెదక్‌ జిల్లా పరిధిలో 1,700, నల్లగొండ జిల్లాలో 1,110, రంగారెడ్డి జిల్లాలో 210 చెరువులు అలుగు దూకుతున్నాయి. మొత్తంగా రెండు బేసిన్‌ లలో 43,412 చెరువుల్లో 13 వేలకు పైగా చెరువులు అలుగుపారుతుండగా, నిండుకుండలుగా మరో 17వేల వరకు ఉన్నాయి. ఇక 50 శాతానికి పైగా నిండినవి 4,490 చెరువులున్నాయి.  మొత్తంగా చెరువుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈ వానాకాలంలోనే 20 లక్షల ఎకరాలకు నీరందుతోంది. మిషన్‌ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరగ్గా, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయి. చెరువులు నిండిన ఫలితంగా వచ్చే యాసంగి సీజన్‌ లో వీటి కింది ఆయకట్టుకు ఢోకా ఉండదని, సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని జల వనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, చెరువుల కట్టలు తెగడం.. బుంగలు పడటం ఇతర నష్టాలు సంభవించడం వంటివి ఈ ఏడాది తక్కువేనని అధికారులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు