కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

18 Sep, 2020 04:10 IST|Sakshi

వ్యవసాయ బిల్లులకు నిరసనగా నిర్ణయం

ఎన్‌డీఏలో కొనసాగే విషయమై త్వరలో నిర్ణయం

శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగాను. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, బిల్లులకు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేశాను. ఒక సోదరిగా, బిడ్డగా రైతుల పక్షం నిలబడినందుకు గర్వంగా ఉంది’ అని సంబంధిత బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందేందుకు కొన్ని గంటల ముందు ఆమె ట్వీట్‌ చేశారు.

అంతకుముందు, ఆ బిల్లులను ఎస్‌ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. భారత్‌ ఆహార రంగంలో స్వావలంబన సాధించడంలో పంజాబ్‌ రైతుల పాత్రను మరచిపోకూడదన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కేబినెట్‌లో తమ పార్టీ ప్రతినిధి అయిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తాను, తమ పార్టీ పదేపదే చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన తన రాజీనామా లేఖలో కౌర్‌ ఆరోపించారు.

తమ పార్టీలోని ప్రతి సభ్యుడు రైతేనని, రైతు సంక్షేమం ధ్యేయంగా తమ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదన్నారు. కౌర్‌ రాజీనామాను ప్రధాని మోదీ ఆమోదించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్‌డీఏలో శిరోమణి అకాలీదళ్‌ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లులను ఎస్‌ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్‌ఏడీకి నెలకొన్నది. ఎన్‌డీఏలో ఎస్‌ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ తెలిపారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని పార్లమెంట్‌ వెలుపల మీడియాతో స్పష్టం చేశారు.

రెండు బిల్లుల ఆమోదం
ఎస్‌ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌(ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లును, ‘ద ఫార్మర్స్‌(ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఆర్‌ఎస్పీలు వాకౌట్‌ చేశాయి. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్‌ కమాడిటీస్‌(అమెండ్‌మెంట్‌)’ మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇవి ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది.

రైతుల ఆదాయం పెరుగుతుంది
వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు. ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కొనుగోలు విధానాలు కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు