పూత నిలబడక.. కాత తగ్గి..!

15 May, 2022 01:50 IST|Sakshi

అనుకూలించని వాతావరణం 

ఈసారి సగానికిపైగా తగ్గిన మామిడి ఉత్పత్తి

13 లక్షల టన్నులకు ఏడున్నర లక్షలే దిగుబడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మామిడి పండ్ల దిగుబడి బాగా పడిపోయింది. పూత ఆలస్యంగా రావడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పూత నిలబడకపోవడంతో దిగుబడులు తగ్గాయని ఉద్యాన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి.

సాధారణంగా ఎకరానికి 3.5 టన్నుల నుంచి 4.5 టన్నుల వరకు మామిడి దిగుబడి కావాలి. అంటే 12 లక్షల నుంచి 13 లక్షల టన్నుల వరకు రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి అవుతుందని అధికారు లు అంచనా వేశారు. కానీ, ఈసారి ఏడున్నర లక్షల వరకే మామిడి దిగుబడి పరిమితం అవుతుందని ఉద్యాన శాఖ అధికారి ఒకరు తెలిపారు.  

రూ.లక్షన్నర నుంచి రూ.62 వేలకు తగ్గిన ధర 
సహజంగా మామిడి ఉత్పత్తి సగానికిపైగా తగ్గిన నేపథ్యంలో డిమాండ్‌ ప్రకారం ధరలు పెరగాలి. కానీ రైతుకు ఆ ధరలు అందడంలేదు. గత నెల గడ్డిఅన్నారం మార్కెట్లో టన్నుకు రూ. లక్షన్నర పలికిన మామిడి ధర, శుక్రవారం గరిష్టంగా రూ. 62 వేలకు పడిపోయింది. కనిష్టంగా రూ. 20 వేలు మాత్రమే ఉండటం శోచనీయం. మోడల్‌ ధర రూ.37 వేలు మాత్రమే ఉంది.

వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం పావు వంతు ధర కూడా పలకని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితమైతే ఒకానొకసారి అదే గడ్డిఅన్నారం మార్కెట్లో మామిడి ధర టన్నుకు రూ. 1.87 లక్షలు పలికింది. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలు తప్ప మరేమీ మిగలడంలేదు. మరోవైపు వినియోగదారులకు ఏమైనా తగ్గి ఇస్తున్నారా అంటే అదీ లేదు. 

ఒకవైపు రైతును, మరోవైపు వినియోగదారులను ఎడాపెడా దోచేస్తున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి టన్నుకు సరాసరి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి పండ్లు రూ.40 వరకు ఉండాలి. కానీ, మార్కెట్లో ఏకంగా రూ. 100 పలుకుతోంది.

కొన్ని రకాలైతే రూ. 150–200 వరకూ వసూలు చేస్తున్నారు. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. మార్కెట్లను వారు తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వినియోగదారులు కూడా ఎవరినీ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడమే ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్నట్లు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు