Telangana: గొర్రెల పంపిణీపై కేంద్ర బృందం ప్రశంసలు

24 Aug, 2021 08:38 IST|Sakshi

మంత్రి తలసానిని కలసిన ఎన్‌సీడీసీ సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర బృందం ప్రశంసలు లభించాయి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) సభ్యులు సోమవారం ఇక్కడ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. సుధీర్‌కుమార్‌ శర్మ, ముఖేశ్‌కుమార్, భూపిందర్‌సింగ్, తెహెదుర్‌ రెహ్మాన్, వి.కె.దుబాసీ, శ్రీనివాసులతో కూడిన బృందం మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రం లో పశుసంపద అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి తలసాని వారికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విరించారు.

జీవాల వద్దకే వైద్యసేవలను తీసుకెళ్లేందుకు సంచార వైద్యశాలలను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా అరగంటలో వైద్యం అవసరమున్న ప్రాంతాలకు తమ సిబ్బంది వెళ్లగలుగుతున్నారని చెప్పారు. మాంసం ఎగుమతి కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, గొర్రె పిల్లల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం అవసరమైన మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. అనంతరం ఎన్‌సీడీసీ సభ్యులు మాట్లాడుతూ పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, గొర్రెల పంపిణీలాంటి పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెల సమాఖ్య ఎండీ రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు