అమెరికాలో వేములవాడ యువకుడి మృతి 

31 May, 2022 02:19 IST|Sakshi
యశ్వంత్‌

స్నేహితులతో కలసి సముద్ర ప్రయాణం 

అలల్లో కొట్టుకుపోయి మృతి 

వేములవాడ: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్‌(25) విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి మరణించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్‌ మిత్రులు, కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్‌ ఎమ్మెస్‌ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడా వెళ్లారు.

వారాంతం కావడంతో ఈనెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరితో కలిసి ఐర్లాండ్‌లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్‌ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు బోట్‌ స్టార్ట్‌ చేయగా.. ఇంజిన్‌ ఆన్‌ కాలేదు. అలల తాకిడికి బోటు 3 మీటర్ల లోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది.

ఇది గమనించని యశ్వంత్‌ నీటిలోకి దిగారు. అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్‌ జాకెట్స్‌ ధరించి నీటిలోకి దిగి దాదాపు 3 గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్‌ మృతితో సుభాష్‌నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. 

మరిన్ని వార్తలు