ఔట్‌ సోర్సింగ్‌కు సర్దుబాటు షాక్‌!

8 Aug, 2022 02:36 IST|Sakshi

గురుకులాల్లో వీఆర్వోల అలజడి 

సర్దుబాటులో భాగంగా సొసైటీల్లో పోస్టింగ్‌లు ఇస్తున్న అధికారులు 

ఎస్సీ గురుకుల సొసైటీలో 65 మంది నియామకం 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ప్రభావం చూపించే అవకాశం 

దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి 

మిగతా గురుకులాల్లోనూ త్వరలో వీఆర్వోల సర్దుబాటు 

సాక్షి, హైదరాబాద్‌:  సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఏళ్లుగా సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో)ల సర్దుబాటు రూపంలో ప్రమాదం వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా కొందరిని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్దేశిస్తూ వారికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించడంతో చర్యలకు దిగిన ఉన్నతాధికారులు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమిస్తున్నారా? లేక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదు.  

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో 65 మందికి.. 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)లో 65 మంది వీఆర్వోలకు ఈ విధంగా పోస్టింగులిస్తూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని వివిధ గురుకుల విద్యా సంస్థల్లో సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, స్టోర్‌ కీపర్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ తదితర పొస్టుల్లో వారిని సర్దుబాటు చేశారు. ఇలా సర్దుబాటు చేసిన పోస్టుల్లో చాలావరకు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులుండడం గమనార్హం. కాగా మిగతా సొసైటీల్లోనూ ఈ విధంగా అతి త్వరలో వీఆర్వోలకు పోస్టింగులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఆందోళనలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 
గురుకుల విద్యా సంస్థల్లో వీఆర్వోల సర్దుబాటుతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో నియమితులైన 65 మంది వీఆర్వోలు శాశ్వత ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చు. తాజాగా సర్దుబాటైన వీఆర్వోలు తక్షణమే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలని ఉత్పర్వుల్లో స్పష్టం చేయడంతో మెజార్టీ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరారు.

దీంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పది నుంచి పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల్లోంచి తీసేస్తే భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయోభారం కారణంగా కొత్తగా తమకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉండదని, అందువల్ల ఒకవేళ తమను ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు.

అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా మిగతా సొసైటీల్లో సైతం ఇదే తరహాలో వీఆర్వోల నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఆయా సొసైటీల్లోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. 

కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం.. 
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సొసైటీనే నమ్ముకుని ఉన్న వారిని తొలగిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించకుండా.. వీఆర్వోలను సర్దుబాటు చేయాలి. ఈ అంశాన్ని ఇప్పటికే సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. 
– సీహెచ్‌ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం 

మరిన్ని వార్తలు