బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు

20 Nov, 2022 04:23 IST|Sakshi

బీజేపీ నేపథ్యం, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై బోధన  

పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 300 మంది హాజరు 

శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో శిబిరం 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్‌ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్‌ కమిటీ జాతీయ ఇన్‌చార్జి పి. మురళీధర్‌రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు.  

మొత్తం 14 సెషన్స్‌.. 
పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్‌ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్‌ సాధించిన విజయాలపై కిషన్‌రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్‌ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్‌ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్‌రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. 

బీఎల్‌ సంతోష్‌ హాజరవుతారా? 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్‌ ప్రకారం సంతోష్‌ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు.

ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ

మరిన్ని వార్తలు