సొంతగూటికి మహాలక్ష్మి

9 Oct, 2020 08:53 IST|Sakshi

  వీడియో ద్వారా బతికి ఉన్నట్లు గుర్తించిన వైనం 

  ఏపీ నుంచి వచ్చి వరంగల్‌ ‘మల్లికాంబ’లో ఆశ్రయం 

  ఆనందంలో కుటుంబ సభ్యులు  

హన్మకొండ అర్బన్‌: మహాలక్ష్మి అలియాస్‌ దొరసాని.. ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామం. మహాలక్ష్మి పెళ్లాయిన కొద్ది రోజుల తరువాత ఆమె తల్లి మృతి చెందింది. తండ్రి వేరే మహిళతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మహాలక్ష్మి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విధి వక్రీకరించి మహాలక్ష్మికి మానసిక సమస్యలు రావడంతో అత్తింటివారు తండ్రి వద్ద వదిలి వెళ్లగా.. సవతి తల్లి ఆమెను రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి పోయింది. అంతటితో ఆగకుండా మానసిక పరిస్థితి సరిగా లేక ఆమె చనిపోయిందని నమ్మించింది. ఎక్కడెక్కడో తిరిగిన మహాలక్ష్మి 2013లో వరంగల్‌ పోలీసుల చెంతకు చేరగా.. ఆమెను హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి అప్పగించారు.

అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటోంది. ఈ మధ్య మనోవికాస కేంద్రంలోని వసతులు, భోజనం, ఇతర కార్యక్రమాలకు సంబంధించి నిర్వాహకులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అందులో మహాలక్ష్మి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు మనోవికాస కేంద్రం నిర్వాహకులు బండ రామలీలను సంప్రదించారు. కొద్ది రోజులుగా మహాలక్ష్మితో వారు మాట్లాడుతున్నారు. ఇంతకాలం ముభావంగా ఉన్న మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తిస్తూ భావోద్వేగానికి గురవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకున్న అధికారులు అంగీకరించడంతో గురువారం మహాలక్ష్మి అన్న, బంధువులు మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చేరుకుని ఆమెను కలిశారు. ఇంతకాలం తమ చెల్లిని కంటికి రెప్పలా కాపాడిన నిర్వాహకులకు మహాలక్ష్మి అన్న ఇతర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను తమ స్వస్థలానికి తీసుకెళ్లారు. (గో కార్టింగ్‌ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా