టీపీసీసీ చీఫ్‌గా నేడు రేవంత్‌ బాధ్యతల స్వీకారం

7 Jul, 2021 02:31 IST|Sakshi

గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు కార్యక్రమం 

హాజరుకానున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌:   తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గాంధీభవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొత్తగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడు మలికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

యూసుఫైన్‌ దర్గాలో ప్రార్థనలు
రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళతారు. అక్కడ పూజలు చేసిన తర్వాత ర్యాలీగా జూబ్లీ చెక్‌పోస్టు, నాగార్జున సర్కిల్, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా నాంపల్లి చేరుకుంటారు. అక్కడ యూసుఫైన్‌ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత గాంధీభవన్‌కు చేరుకుని, మధ్యాహ్నం 1:30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు.
 
భట్టి సహా పలువురు నేతలతో భేటీ
రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జెట్టి కుసుమకుమార్, మల్లు రవిలతో కలిసి పలువురు టీపీసీసీ నేతల నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. ముందుగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఇంటికి, ఆ తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీఎల్పీ నేత భట్టి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఇళ్లకు వెళ్లారు. తొలుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లురవి బంజారాహిల్స్‌లోని భట్టి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాతే భట్టిని రేవంత్‌ కలుస్తారనే సమాచారం మీడియాకు అందింది. కాగా భట్టిని కలిసిన సందర్భంగా రేవంత్‌ ఆయనతో ఏకాంతంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తోన్న రేవంత్‌ విజయం సాధించాలని భట్టి ఆకాంక్షించారు. రేవంత్‌ మాట్లాడుతూ సీఎల్పీ, పీసీసీ అధ్యక్ష పదవులు జోడెడ్ల లాంటివని, భట్టి సూచనల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన సందర్భంగా రేవంత్‌ను శాలువాలతో సన్మానించారు. కాగా, రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఉత్తమ్‌ నేరుగా బెంగళూరులోని జిందాల్‌ ఆశ్రమానికి వెళ్లి అక్కడ 10 రోజుల పాటు ప్రకృతి చికిత్స పొందనున్నారు.  

మరిన్ని వార్తలు