ధరణి పోర్టల్‌పై నేడు కౌంటర్‌ దాఖలు చేయనున్న ప్రభుత్వం

10 Dec, 2020 12:35 IST|Sakshi

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ఈ నెల 17కి వాయిదా

బీఆర్‌ఎస్‌పై విచారణ ఈ నెల 24కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కలకలం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీకి అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి  వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటీషన్‌ దాఖలు చేసి మూడేళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయడం లేదని రేవంత్‌ తరఫు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.

ధరణి పోర్టల్‌పై నేడు విచారణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్‌లో వ్యవసయేతర ఆస్తుల నమోదుపై హై కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్‌ని నేటి వరకు పొడిగించింది. ఇక నేటి విచారణలో ధరణికి సంబంధించిన జీవోలపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయనుంది. నేడు పిటీషన్‌ విచారణని కోర్టు మధ్యాహ్న 2.30 గంటలకి వాయిదా వేసింది. (చదవండి: రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు)

బీఆర్‌ఎస్‌పై ఎందుకు ఇంత జాప్యం
బీఆర్ఎస్‌పై నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం తెలంగాణ హై కోర్టును కోరింది. చివరి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే 2016లో దాఖలైన పిల్‌లో ఇంతవరకు కౌంటర్‌ దాఖలు చేయ్యలేదన్న కోర్టు.. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. భవానాల క్రమబద్ధీకరణపై తదుపరి విచారణను హై కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు