Hyderabad: హిజ్రాల ఆగడాలు.. సిగ్నల్‌ పడిందా.. డబ్బు గుంజుడే! 

16 Nov, 2022 18:15 IST|Sakshi
హస్తినాపురం సెంట్రల్‌లో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న థర్డ్‌ జెండర్‌   

సాక్షి, హైదరాబాద్‌(వనస్థలిపురం): పలు ప్రాంతాలలో హిజ్రాలు (థర్డ్‌ జెండర్స్‌) ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటి వరకు వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లకు వచ్చి డబ్బులు వసూలు చేసే థర్డ్‌ జెండర్స్‌ నేడు రోడ్లపై తిరుగుతూ వాహనదారులను సైతం వదలిపెట్టడం లేదు.

హస్తినాపురం సెంట్రల్‌లో నిత్యం తిష్టవేస్తున్న హిజ్రాలు ట్రాఫిక్‌ రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనదారుల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  ఎవరైనా ఇవ్వకపోతే అతని బండి తాళం చెవి లాక్కుని సిగ్నల్‌ పడినా ఇవ్వకుండా వేధిస్తున్నారు.  ఇదేమని ఎవరైనా అడిగితే వారిని హేళన చేస్తున్నారు.  హస్తినాపురంలో చౌరస్తాలో ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఉన్నా వారిని అడ్డుకున్న పాపాన పోవడం లేదు.

హిజ్రాల ఆగడాలు ఎక్కువవుతున్నాయని,  హస్తినాపురం సెంట్రల్‌ దాటాలంటే టోల్‌గేట్‌ పన్ను లాగా వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు గానీ, ట్రాఫిక్‌ పోలీసులు గానీ జోక్యం చేసుకుని హిజ్రాల నుంచి తమను రక్షించాలని వాహనదారులు కోరుతున్నారు. 

చదవండి: (అందుకే ఢిల్లీకి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి)

మరిన్ని వార్తలు