ధాన్యం తరుగు తీయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు

27 Oct, 2021 03:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాణ్యత ప్రమాణాలతో కొనుగోళ్లు చేయాలి

కేంద్రంలో తూకం మేరకు చెల్లింపులు చేయాలి

ఈ వానాకాలం సీజన్‌ నుంచే అమలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రైతు కందుల రంగారావు గత యాసంగిలో కౌలుకు తీసుకున్న 12 ఎకరాలు, సొంతంగా తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేశాడు. సమీపంలోని మేడేపల్లి సహకార సొసైటీలో ధాన్యం అమ్మాడు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేస్తే ఈ ధాన్యం 400 క్వింటాళ్లు అయింది. ఈ ధాన్యాన్ని లారీలో కరీంనగర్‌ జిల్లాలోని రైస్‌మిల్లుకు తరలించారు. రెండు, మూడు నెలల వ్యవధిలో అతనితో పాటు అతని భార్య ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే రూ.40 వేలకు పైగా తక్కువ జమయ్యాయి.

కొనుగోలు కేంద్రంలో లెక్క వేసిన దాని కన్నా 24 క్వింటాళ్ల తరుగు (క్వింటాల్‌కు 6 కేజీలు చొప్పున) తీయడమే ఇందుకు కారణం. కొనుగోలు కేంద్రంలో కాంటాకు, మిల్లుకు చేరిన తర్వాత వేబ్రిడ్జికి తూకంలో తేడా ఉండటం, కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తర్వాత కొన్నిరోజుల పాటు ధాన్యం బస్తాల్లోనే ఎండటం వంటి కారణాలతో ఈ తరుగు వచ్చింది. రంగారావు ఒక్కరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు ఈ విధంగా తరుగు కారణంగా నష్టపోయాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో రైతులకు తరుగు బాధ తప్పనుంది. 

ఆరబెట్టని ధాన్యంతోనే తంటా
గత పదేళ్లుగా వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పులొచ్చాయి. హార్వెస్టర్ల (వరి కోత మిషన్‌)తో రైతులకు శ్రమ, కూలీల బాధ తప్పింది. ఈ మిషన్ల ద్వారా కోసిన వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తరలిస్తుండటంతో తేమ శాతంతో నష్టపోవాల్సి వస్తోంది. అయితే ఆరబెట్టని ధాన్యాన్ని రైతులు అమ్మకానికి తెస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొర్రీలు పెట్టి కమీషన్లు ఇస్తేనే.. కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందాయి.

మరోవైపు ఇలా కొనుగోలు చేసిన ధాన్యమే కాకుండా, తేమ ప్రమాణాలు పాటించిన ధాన్యానికి కూడా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు తరుగు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత అమ్మకానికి రోజులు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కాంటాలు వేసిన తర్వాత బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు సకాలంలో రావడం లేదు. ఎలాగో మిల్లులకు చేరినా అక్కడ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈలోగా ధాన్యం ఎండిపోతుండటం, మిల్లుకు ధాన్యం చేరే వరకు రైతుదే బాధ్యత కావడంతో ప్రతి ఏటా రైతులు తరుగు కారణంగా నష్టపోతున్నారు.

బస్తాకు ఇక 40 కేజీలు నికరం
ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ, హాకా, వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసే ధాన్యం మిల్లులకు చేరే వరకు రైతులదే బాధ్యత అనే నిబంధన గత యాసంగి సీజన్‌ వరకు ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తా 41 కేజీల ధాన్యం తూకం వేస్తారు. గన్నీ బ్యాగు బరువు, ఇతర తరుగు కలిపి కేజీ మినహాయించి 40 కేజీలకు రైతుకు ధర చెల్లించాలి. అయితే కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు చేరే వరకు రైతే బాధ్యత వహించాలనే పేరిట ఈ 40 కేజీల్లోనూ 2 నుంచి 10  కేజీల వరకు తరుగు పేరుతో తీస్తున్నారు. దీంతో రైతులు క్వింటాళ్ల కొద్దీ ధాన్యాన్ని నష్టపోతున్నారు.

అయితే ఈ వానాకాలం నుంచి ఇలా తరుగు తీయవద్దని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రాల్లో ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఇక నుంచి అన్ని క్వింటాళ్లకు గన్నీ బ్యాగు బరువు, ఇతర తరుగు కేజీ వరకు మాత్రమే మినహాయించి ధర చెల్లించాలి. అంటే ఇకపై నికరంగా బస్తాకు 40 కేజీల ధాన్యానికి ధర చెల్లిస్తారన్న మాట. అలాగే కొనుగోలు కేంద్రంలో అమ్మకంతోనే రైతుల బాధ్యత ముగియనుంది. 

నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నాణ్యత ప్రమాణాలను అనుసరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సూచనల మేరకు తేమ, ఇతరత్రా ప్రమాణాలు పాటించి కొనుగోలు చేయాలి. అంటే రైతులు ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావలసి ఉంటుంది. ఈ మేరకు ముందస్తుగా వ్యవసాయ, సంబంధిత శాఖలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావడంతో పాటు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకునేందుకు రైతులకు అవసరమైన సూచనలు చేయాలి.

రైతుల ప్రమాణాలు పాటించేలా చూస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాలకు ప్రభుత్వం సూచించింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తే.. ఆ తరుగుకు సంబంధించి నిర్వాహకులే ఆ నష్టాన్ని రైతులకు చెల్లించాలని స్పష్టం చేసింది. గ్రేడ్‌– ఎ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు