ఆ 177 మంది చిన్నారులను అక్కున చేర్చుకోండి: హైకోర్టు

24 Jun, 2021 08:01 IST|Sakshi

177 మంది అనాథల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి 

గతంలో ఇచ్చిన వివరాలనే మళ్లీ సమర్పించారంటూ డీజీపీపై హైకోర్టు ధర్మాసనం అసహనం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో మృత్యువాత పడిన వారి పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మొదటి, రెండోదశ కరోనా కారణంగా అనాథలుగా మారిన 177 మంది చిన్నారులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి పది మంది చిన్నారుల యోగక్షేమాలు చూసేందుకు ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచిం చింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా డీజీపీ, జైళ్ల శాఖ డీజీపీ, మున్సిపల్, పౌరసరఫరాలు, విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల కమిషనర్లు దాఖలు చేసిన స్థాయి నివేదికలను ధర్మాసనం పరిశీలించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉల్లంఘనల కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బృం దాలు ఏర్పాటు చేశామంటూ గతంలో ఇచ్చిన అం శాలనే డీజీపీ తన నివేదికలో పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ నాటికి స్థాయి నివేదిక ఇవ్వాలని వీరందరినీ ఆదేశిస్తూ విచారణను జూలై 7కు వాయిదా వేసింది.  

ధర్మాసనం ఆదేశాలివే.. 

  • కరోనా సమయంలో మహిళలు గృహహింసకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలి. 
  • ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనాతో మృత్యువాతపడిన వారికి డెత్‌ బెనిఫిట్స్‌ను వెంటనే అందించేలా చర్యలు తీసుకోండి. 
  • నీలోఫర్‌లో 24 బెడ్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో కరోనా బారినపడే చిన్నారులకు చికిత్సలు అందించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో స్పష్టం చేయండి. 

మరిన్ని వార్తలు