ఆర్టీసీకి ఎట్టకేలకు అప్పు పుట్టింది!

3 Aug, 2021 01:54 IST|Sakshi

ప్రభుత్వ పూచీకత్తుపై రూ.500 కోట్లు అందించిన ఓ బ్యాంకు 

రూ.వెయ్యి కోట్లు అడిగితే సగమే మంజూరు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ఎట్టకేలకు అప్పు పుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఓ బ్యాంకు రూ.500 కోట్ల రుణాన్ని అందించింది. ఇంతకాలం రుణం ఇచ్చేందుకు బ్యాంకులు జంకటంతో ఆర్టీసీ సంస్థ దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడింది. సొంత ఆదాయం ఏమాత్రం అవసరాలను తీర్చలేకపోవడం, కోవిడ్‌ దెబ్బతో భారీగా టికెట్‌ ఆదాయం తగ్గిపోవటం, కార్గో విభాగం పుంజుకోకపోవటం, ప్రత్యామ్నాయ ఆదాయం లేకపోవటంతో ఆర్టీసీ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు నుంచి అందిన రూ.500 కోట్ల అప్పు కొంత ఊరటనిచ్చినట్టయింది.  

గోప్యంగా అప్పు విషయం  
వాస్తవానికి రూ.వేయి కోట్ల సాయం కావాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచి దాన్ని విడుదల చేయాలని అడిగింది. కానీ, నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపని ప్రభుత్వం, అంతమేర పూచీకత్తు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆ పూచీకత్తు చూపి బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చుట్టూ తిరగ్గా ఓ బ్యాంకు సరే అన్నా దాని కేంద్ర బోర్డు మోకాలొడ్డింది. అసలే దివాలా దిశలో ఉన్న ఆర్టీసీకి ఏకంగా రూ.వేయి కోట్ల అప్పు ఇవ్వడం సరికాదని నిరాకరించింది. రూ.500 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. దాన్ని కూడా నెలన్నర కాలయాపన తర్వాత తాజాగా విడుదల చేసింది. ఈ రుణం విషయం తెలిసి, పాత బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ సహకార పరపతి సంఘం పాలకవర్గం, అద్దె బస్సుల యజమానులు, ఆయిల్‌ కంపెనీలు బస్‌భవన్‌ చుట్టూ తిరగటం ప్రారంభించారు. మరోవైపు పాత వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కార్మిక సంఘాలూ ఒత్తిడి ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రుణం చేతికందిన విషయాన్ని ఆర్టీసీ గోప్యంగా ఉంచింది.  

ఎండీ వచ్చాక నిర్ణయం.. 
తనను ఆర్టీసీ బాధ్యతల నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ అనారోగ్య కారణాలతో 25 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన మంగళవారం విధుల్లో చేరనున్నారు. అధికారులు ఆయనను సంప్రదించి ఆ రూ.500 కోట్లను వేటివేటికి ఖర్చు చేయాలన్న విషయంలో స్పష్టత తీసుకోనున్నారు.    

మరిన్ని వార్తలు