అ‘ధర’హో.. పసుపు క్వింటాల్‌కు రూ. 10 వేలు!

9 Mar, 2021 12:03 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: పసుపు పంట క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతుండటంతో రైతులు సంబరపడి పోతున్నారు. వర్షాలు, చీడ పురుగుల కారణంగా పసుపు దిగుబడి సగానికి తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మార్కెట్‌ యార్డుకు రోజుకు సుమారు 200 క్వింటాళ్ల పసుపు వస్తోంది. సోమవారం మెట్‌పల్లి మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. మరోవైపు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డుకు నిత్యం 25 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా సోమవారం అత్యధికంగా 50 వేల క్వింటాళ్లకు పైగా పంటను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వింటాల్‌ పసుపునకు అత్యధికంగా రూ.10,555 ధర పలకడం విశేషం. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

గతం కంటే రెట్టింపయ్యింది  
ఈసారి పసుపు ధర గతం కంటే రెట్టింపు పలుకుతోంది. రైతులు మార్కెట్‌లో అమ్ముకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు చేరువైంది. ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. 

మరిన్ని వార్తలు