ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వీరి ప్రేమ గుడ్డిది కాదు!

9 Apr, 2021 14:33 IST|Sakshi
శేషుకుమారి, క్రాంతికుమార్‌ల వివాహ దృశ్యం 

ప్రేమించి పెళ్లిచేసుకున్న అంధకళాకారులు

సాక్షి, ఖమ్మం‌: కళాకారులైన ఇద్దరు అంధులు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు, మిత్రులు, పెద్దలు పెళ్లి జరిపి, ఆశీర్వదించారు. మండల పరిధిలోని తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీరంగం శేషుకుమారి అంధురాలు. ఆమె తండ్రి వెంకటరమణ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత తల్లి అనురాధ అన్నీ తానై కుమార్తెను పెంచింది. శేషుకుమారి ఓ అంధుల కచేరి బృందంలో గాయనిగా అలరిస్తోంది. అదే బృందంలో ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన అంధుడైన గుత్తా క్రాంతికుమార్‌తో వాయిద్య కళాకారుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వరుడి బంధువులు మొదట్లో ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో తాటిపూడి ఎంపీటీసీ అల్లిక కాటంరాజు, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వారిని ఒప్పించారు. చివరికి ఇరు కుటుంబాల బంధువులు, మిత్రులు, గ్రామస్తుల సమక్షంలో శేషుకుమారి, క్రాంతికుమార్‌ల వివాహం గురువారం తాటిపూడిలో ఘనంగా జరిగింది. ఎంపీటీసీ అల్లిక కాటంరాజు పెళ్లి, భోజనం ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు