5G Technology: 5జీతో దేశంలో 2 కోట్ల కొత్త ఉద్యోగాలు

21 Aug, 2022 03:20 IST|Sakshi

దేశంలో లభించనున్న కొత్త ఉద్యోగ అవకాశాలు 

రాష్ట్ర ప్రభుత్వ ‘టాస్క్‌’తో అవగాహన కుదుర్చుకున్న టీఎస్‌ఎస్‌సీ 

వచ్చే రెండు, మూడేళ్లలో లక్ష మంది యువతకు శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ ‘5జీ’భారత్‌ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌’(టీఎస్‌ఎస్‌సీ) అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌ ఇప్పటికే ఎమర్జింగ్‌ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఉంది.

అదే తరహాలో 5జీ సాంకేతికత ఆధారంగా వచ్చే కొత్త ఉద్యోగాలను ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడేళ్లలో సుమారు లక్ష మందికి 5జీ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమలు, నైపుణ్య సంస్థలను ఒక చోటకు చేర్చి, ‘టెలికాం మంథన్‌ 2022’పేరిట ఇటీవల చర్చించింది. 

హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ 
తెలంగాణలో నైపుణ్య శిక్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో టెలికాం రంగంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ టీఎస్‌ఎస్‌సీ హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ‘టాస్క్‌’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో టీఎస్‌ఎస్‌సీ ఏర్పాటు చేసే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 5జీతో పాటు ఐఓటీ, డ్రోన్‌ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల నైపుణ్య శిక్షణపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

5జీ టెక్నాలజీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలను టాస్క్‌ ఏకతాటిపైకి తెస్తే.. శిక్షణ, సర్టిఫికెట్ల జారీ టీఎస్‌ఎస్‌సీ ద్వారా జరుగుతుంది. కొత్త టెక్నాలజీలపై ఆసక్తి, నేర్చుకునే ఉత్సాహం కలిగిన యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నందునే హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఎస్‌సీ ప్రకటించింది.

హైదరాబాద్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేవలం 5జీ సాంకేతికతలో శిక్షణకే పరిమితం కాకుండా భారత్‌లో 5జీ వాతావరణం అభివృద్ధితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తేవడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. 5జీ రంగంలో సప్లై చెయిన్‌ పెరిగినకొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నానాటికి పెరిగే డిమాండ్‌ను నెరవేర్చడంలో ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కీలకంగా మారనుంది. 

రెండు, మూడేళ్లలో లక్ష మందికి ‘5జీ శిక్షణ’ 
ప్రస్తుతం 4జీ సాంకేతికత ఆధారిత మొబైల్‌ ఫోన్లను దేశంలో 80 శాతం జనాభా ఉపయోగిస్తోంది. 4జీ టెక్నాలజీతో పోలిస్తే కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీ వంద రెట్ల వేగంతో పనిచేయనుండటంతో, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల్లో నైపుణ్య శిక్షణ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే పలు సంస్థలు 5జీ టెక్నాలజీతో పాటు ఐఓటీ, ఏఐ, ఎంఎల్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలపై తమ ఉద్యోగులకు అంతర్గత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చే రెండు, మూడేళ్లలో టీఎస్‌ఎస్‌సీ హైదరాబాద్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా లక్ష మంది యువతకు 5జీ సాంకేతికతపై శిక్షణ ఇస్తారు.    

మరిన్ని వార్తలు