ఇద్దరు దోస్తులు.. టెన్త్‌లో ఒకరు ఫెయిల్‌, ఒకరు పాస్‌.. 25 ఏళ్లుగా డాక్టర్‌ పని

28 Sep, 2022 09:51 IST|Sakshi

వరంగల్‌ క్రైం: చదివింది పదో తరగతి.. అందులో ఒకరు ఫెయిల్‌.. మరొకరు పాస్‌. ఇద్దరు మిత్రులు.. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం.. పైసలపై ఆశ పెరగడంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్‌ఫోర్స్, ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. నకిలీ డాక్టర్ల నుంచి రూ.1.28 లక్షలు నగదు, ఆస్పత్రి పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

మంగళవారం కమిషరేట్‌లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్‌ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్‌ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన మహ్మమద్‌ రఫీ ఫెయిల్‌ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో బీహార్‌ రాష్ట్రంలోని దేవఘర్‌ విద్యాపీఠ్‌ విశ్వవిద్యాలయంనుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లతోపాటు గుర్తింపు కార్డులు కొనుగోలు చేశారు. కుమార్‌ క్రాంతి క్లినిక్‌ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్‌ పేరుతో చార్‌బౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. 

సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్‌ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు.. వరంగల్‌ రీజినల్‌ ఆయుష్‌ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్, పోలీసులను సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి అభినందించారు.

మరిన్ని వార్తలు