బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి

18 Oct, 2021 02:36 IST|Sakshi
మాధవీలత (ఫైల్‌) శివ (ఫైల్‌)

ప్రమాదవశాత్తు సాగర్‌కాల్వలో మునిగి ఇద్దరు మృతి

కల్లూరు రూరల్‌: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథబంజర్‌లో శనివారంరాత్రి జరిగిన బతుకమ్మ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్‌ కాల్వనీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. వివరాలు.. నాగార్జునసాగర్‌ కాల్వలో బతుకమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ఖమ్మంపాటి మాధవీలత(25), పసుపులేటి శివ(23) నీటమునిగి మృతిచెందారు.

వివరాలు.. రఘునాథబంజర్‌ గ్రామంలో పేర్చిన బతకమ్మలను శనివారంరాత్రి ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి దాటిన అనంతరం కూడా కొనసాగింది. తర్వాత గ్రామం పక్కనే ఉన్న సాగర్‌ ప్రధాన కాల్వనీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు భక్తులంతా అక్కడికి చేరుకున్నారు. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా ఖమ్మంపాటిమాధవీలత(25) నీటిలోకి జారింది. అక్కడే ఉన్న పసుపులేటి శివ(23)తోపాటు మరో ఇద్దరు కాల్వలోకి దూకి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా కాసేపటికే మాధవీలత చనిపోయింది.

అయితే ఆమె మృతదేహాన్ని గాలించి ఒడ్డుకు చేర్చేక్రమంలో శివ నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. మాధవీలత మృతదేహాన్ని కాల్వగట్టుపైకి తెచ్చిన కొద్దిసేపటికి అక్కడున్నవారు గుర్తించి శివ కోసం రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కాల్వనీటిపైన మృతదేహం తేలగా గ్రామస్తులు గమనించి ఒడ్డుకు చేర్చారు.  

పండుగ కోసం ఊరొచ్చి ఇలా.. 
ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన రాధాకృష్ణ, మాధవీలత భార్యాభర్తలు. అక్కడే నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు రఘునాథబంజర్‌లో రేషన్‌డీలర్‌. పసుపులేటి శివ తండ్రి రామయ్య సామాన్య కూలీ. రామయ్యకు శివతోపాటు ఓ కుమార్తె ఉంది. శివ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అవివాహితుడు. దసరా పండుగ కోసం వచ్చిన వీరిద్దరూ ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు