ఆర్టీసీపై ‘ఉక్రెయిన్‌’ దెబ్బ

20 Feb, 2022 03:18 IST|Sakshi

రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలతో పెరిగిన చమురు ధరలు 

ఒక్కరోజులో డీజిల్‌పై రూ.5.50 మేర పెరుగుదల 

బయట బంకుల్లో కంటే లీటర్‌కు రూ.1.25 ఎక్కువకు కొనాల్సిన దుస్థితి 

చమురు కంపెనీల నుంచి నేరుగా డీజిల్‌ కొంటుండటంతో

రోజుకు సగటున రూ.30 లక్షల అదనపు భారం 

బహిరంగ మార్కెట్‌లో ఆ ప్రభావం లేకుండా కేంద్రం సర్దుబాటు 

ప్రస్తుతం రిటైల్‌గా కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: రష్యా–ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు ఆర్టీసీని వణికిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. బ్యారెల్‌ ధర భారీగా పెరగటంతో ఆయిల్‌ కంపెనీలు ఒక్కసారిగా చమురు ధరలను పెంచేశాయి. చమురు కంపెనీల నుంచి నేరుగా డీజిల్‌ కొనుగోలు చేస్తుండటంతో ఆర్టీసీపై ఆ ప్రభావం నేరుగా పడింది. ఒక్కరోజు వ్యవధిలో లీటర్‌ డీజిల్‌ ధర దాదాపు రూ.6 పెరిగిపోవడంతో సంస్థ ఉక్కిరికిబిక్కిరవుతోంది. సాధారణ జనానికి కూడా ఆ షాక్‌ తగలాల్సి ఉన్నా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చమురుపై వేసే పన్నులను సర్దుబాటు చేయటం ద్వారా భారాన్ని తప్పించింది. కానీ ఈ సర్దుబాటు ఆర్టీసీకి లేకుండా పోయింది. దీంతో సగటున రోజుకు రూ.30 లక్షల అదనపు భారం పడటంతో విలవిల్లాడుతోంది. చమురు కంపెనీల నుంచి నేరుగా కొనే విధానాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, సాధారణ బంకుల నుంచి లూజుగా కొనేందుకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది.  

అతిపెద్ద కొనుగోలుదారు 
చమురు కంపెనీలకు ఆర్టీసీ అతిపెద్ద కొనుగోలుదారు. దీంతో బహిరంగమార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే తనకు చమురు సరఫరా చేసేలా ఆయిల్‌ కంపెనీలతో గతంలో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో బహిరంగమార్కెట్‌లో వాహనదారులకు దొరికే ధరతో పోలిస్తే ఎప్పటికప్పుడు లీటరుకు రూ.4 నుంచి రూ.5 చొప్పున తక్కువకే ఆర్టీసీ డీజిల్‌ను పొందుతోంది. ఈ డిస్కౌంట్‌ ప్రకారం..సంస్థకు సగటున నెలకు రూ.7.5 కోట్లు ఆదా అవుతోంది. అయితే ఆ విధానమే ఇప్పుడు ఆర్టీసీని ఇబ్బందుల్లోకి నెట్టింది. మూడురోజుల క్రితం వరకు డీజిల్‌ను లీటరుకు రూ.90.11కి కొంటున్న ఆర్టీసీ ఏకంగా రూ.95.86కు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ప్రస్తుతం రోజుకు 5 లక్షల నుంచి 5.50 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్న ఆర్టీసీకి దీనివల్ల రూ.28 లక్షల నుంచి 30 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే నెలకు దాదాపు రూ.9 కోట్ల అదనపు భారమన్న మాట. దీంతో బిత్తర పోయిన ఆర్టీసీ వెంటనే చమురు కంపెనీలతో చర్చించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినందున చేసేదేమీలేదని కంపెనీలు చెప్పటంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నందున, రిటైల్‌గా బంకుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచి దాన్ని అమలులో పెట్టేలా ఆయిల్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

►    ఫిబ్రవరి 15: పెట్రోలు బంకుల్లో లీటరు డీజిల్‌ ధర రూ.94.61 
►   అదే రోజు ఆర్టీసీకి చమురు కంపెనీలు నేరుగా సరఫరా చేసిన డీజిల్‌ ధర లీటరు రూ.90.11 
►    ఫిబ్రవరి16: పెట్రోలు బంకులో ధర రూ.94.61 వద్ద స్థిరంగా ఉంది. 
►   కానీ ఆర్టీసీకి సరఫరా అయిన డీజిల్‌ లీటరు ధర రూ.95.86 
►   ఒకరోజు ముందు వరకు రిటైల్‌ ధర కంటే లీటరుపై రూ.4.50 తక్కువగా డీజిల్‌ పొందిన ఆర్టీసీకి భారీ షాక్‌.. తెల్లారేసరికి ఆ డిస్కౌంట్‌ ఆవిరవటమే కాకుండా, రిటైల్‌ ధరను మించి రూ.1.25 పెరగడంతో అధికారుల గుండె గుభేల్‌మంది.

మరిన్ని వార్తలు