వందే భారత్‌ రైలు.. హైదరాబాద్‌ ట్రాక్‌లపై నడిచేనా!

9 Oct, 2022 21:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందే భారత్‌ రైళ్ల రాకపోకలకు హైదరాబాద్‌ ట్రాక్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతిరోజూ ఎంఎంటీఎస్‌లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు తీసే ట్రాక్‌లోనే వచ్చే ఏడాది నుంచి వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు నగరాలకు ఈ అధునాతన రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

కానీ ప్రహరీలు, ఫెన్సింగ్‌ వంటి ఎలాంటి రక్షణ చర్యలు లేని నగరంలోని రైల్వేలైన్‌లు వందేభారత్‌ రైళ్ల నిర్వహణకు సవాల్‌గా మారాయి. ట్రాక్‌ల వెంట అనేక చోట్ల మలుపులు, ప్రమాదకరమైన స్థలాలు ఉన్నాయి. మనుషులు ఒకవైపు నుంచి మరోవైపునకు ట్రాక్‌లు దాటుతుంటారు. ఈ క్రమంలో గంటకు 150కిపైగా కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే వందేభారత్‌ రైళ్లకు ఏ చిన్న అవాంతరం ఏర్పడినా భారీ నష్టం వాటిల్లుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

ఒకే ట్రాక్‌లో రెండు ప్రమాదాలు.. 
►  ఇటీవల అహ్మదాబాద్‌– ముంబై ట్రాక్‌లో ఏకంగా రెండుసార్లు వందేభారత్‌ రైళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మొదటిసారి అడ్డుగా వచ్చిన అయిదు గేదెలను ఢీకొనడంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. ఈ ఉదంతంలో రైలు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం మరిచిపోకముందే మరో సంఘటనలో ట్రాక్‌కు అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టడంతో రెండోసారి వందేభారత్‌ రైలుదెబ్బతిన్నది. ట్రాక్‌లకు ఇరువైపులా కంచె లేకపోవడం వల్ల పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 
►   మరోవైపు సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఇంజిన్లు దెబ్బ తినకుండా క్యాటిల్‌ గార్డ్‌లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రైళ్లు పశువులను ఢీకొట్టినప్పటికీ ఇంజిన్లు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. కానీ వందేభారత్‌ రైళ్లకు ఇలాంటి గార్డ్‌లను ఏర్పాటు చేసే అవకాశం లేదు. సురక్షితమైన ట్రాక్‌ల నిర్వహణ ఒక్కటే పరిష్కారం. అహ్మదాబాద్‌– ముంబై మార్గంలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల నుంచి హైదరాబాద్‌లో వందేభారత్‌ రైళ్ల నిర్వహణపై పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  

ప్రమాదకరంగా పట్టాలు..
నగరంలో సుమారు 45 కిలోమీటర్ల మార్గంలో రెండు వైపులా వందల కొద్దీ బస్తీలు, కాలనీలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రహరీ గోడలు కానీ, ఫెన్సింగ్‌ కానీ లేకపోవడం వల్ల మనుషులు రాత్రింబవళ్లు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్తారు. దీంతో ఎంఎంటీఎస్‌ రైళ్లు, కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొని తరచుగా మృత్యువాత పడుతున్నారు. పశువులు చనిపోతున్నాయి. భరత్‌నగర్, హఫీజ్‌పేట్, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, విద్యానగర్, సీతాఫల్‌మండి వంటి అనేక చోట్ల పెద్ద సంఖ్యలు మలుపులు ఉన్నాయి. కొన్ని చోట్ల వార్నింగ్‌ అలారమ్‌లు ఏర్పాటు చేశాను.

కానీ ఫెన్సింగ్‌ లేకపోవడం వల్ల రాకపోకలను  మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోటప్రహరీలు నిర్మించడం వంటి పనులు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రైల్వే చట్టం ప్రకారం మనుషులు, పశువులు ట్రాక్‌లు దాటడం నేరం. ఈ నేరాలు జరగకుండా అరికట్టేందుకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ సహా అన్ని రైళ్లకు క్యాటిల్‌ గార్డ్‌లు ఉండడం వల్ల రైలు ఇంజిన్లు దెబ్బతినడం లేదు. భవిష్యత్‌లో వందేభారత్‌ రైళ్లు ఈ మార్గంలో నడిస్తే ఇంజిన్లు దెబ్బతిని అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది.

చదవండి: సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్‌లో తొలి కట్టడం ఏంటో తెలుసా!

మరిన్ని వార్తలు