‘నువ్వెంత అంటే నువ్వెంత’..పైలట్, పట్నం వాగ్వాదం

11 Dec, 2021 02:11 IST|Sakshi

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఒకదశలో వారు కొట్టుకునేంత పనిచేశారు.

ఎమ్మెల్సీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎమ్మెల్యే వర్గం అభ్యంతరం తెలపడం గొడవకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తాండూరులో గ్రామపంచాయతీలకు ఫాగింగ్‌ మెషీన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీలు పట్నం, సురభి వాణీదేవి హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఆశీనులు కాగా, ఎమ్మెల్యే వర్గాని కి చెందిన సర్పంచ్‌ రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దేముల్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌ అభ్యంతరం తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రొటోకాల్‌ ప్రకారం హాజరైతే అభ్యంతరమెందుకని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నేతల గొడవపట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

మరిన్ని వార్తలు