అభిమానులు గర్వపడేలా సాహితీ సదనం

30 Jul, 2020 05:22 IST|Sakshi

‘సినారె సాహితీ సదనం’ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ 

జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌): కళాభిమానులు, సాహిత్యాభిమానులు గర్వపడేలా సాధ్యమైనంత వేగంగా సినారె సాహితీ సదనం భవన నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రఖ్యాత కవి, సాహితీవేత్త డాక్టర్‌.సి.నారాయణరెడ్డి స్మృ త్యర్థం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మూడువేల గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘సినా రె సాహితీ సదనం’భవన నిర్మాణానికి బుధవారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డు పొందడంతో పాటు, దక్షిణాదిలోనే తొలిసారి కళాకారుల కోటాలో రాజ్యసభకు ఎంపికైన సాహితీవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన తెలుగుజాతి వైతాళికులు సి.నారాయణ రెడ్డి అని, ఆయన స్మృతికి చిహ్నంగా నిర్మించనున్న ఈ భవనానికి శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. 

‘నన్ను దోచు కుందువటే ’పాటతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి ‘సువ్వీ సువ్వీ’, ‘వటపత్రశాయికి వరహాల లాలీ’అంటూ స్వాతిముత్యం చిత్రం సహా వంద లాది చిత్రాల్లో ఆయన రాసిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సినారె కుటుంబసభ్యులు భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ..నగరం నడిబొడ్డున సాహితీ సదనం నిర్మించడం సంతోషకరమని, సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రమణాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు