సిన్హాకు ఘన స్వాగతానికి టీఆర్‌ఎస్‌ సన్నాహాలు 

1 Jul, 2022 03:03 IST|Sakshi
జలవిహార్‌లో యశ్వంత్‌ సిన్హా సభ ఏర్పాట్లను  పరిశీలిస్తున్న తలసాని, మహమూద్‌ అలీ, పల్లా తదితరులు 

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి రేపు హైదరాబాద్‌కు యశ్వంత్‌ 

సభ, ఇతర ఏర్పాట్లపై మంత్రులు, నేతలతో కేటీఆర్‌ సమీక్ష 

ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్న కేసీఆర్‌ 

బేగంపేట నుంచి బైక్‌ ర్యాలీ.. జలవిహార్‌లో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన యశ్వంత్‌ సిన్హా ప్రచారంలో భాగంగా ఈ నెల 2న హైదరాబాద్‌కు వస్తున్నారు. సిన్హా అభ్యర్థిత్వానికి ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు గురువారం గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.

సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి గద్వాల తదితరులు కూడా హాజ రయ్యారు. యశ్వంత్‌ సిన్హాకు స్వాగత సన్నాహాలు, ఆయనతో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించాలని నిర్ణయించారు.  

స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్‌ 
గతంలో ఎన్‌డీయే అభ్యర్థిగా పోటీ చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికిన రీతిలోనే యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ నెల 2వ 
తేదీ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే సిన్హాకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు స్వయంగా స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ వరకు పది వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహిస్తారు.

జల విహార్‌లో జరిగే సమావేశానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఓటు హక్కు లేకున్నా పార్టీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లను కూడా ఆహ్వానించారు. అక్కడే భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత సీఎం కేసీఆర్‌ ప్రసంగం, ఆ తర్వాత యశ్వంత్‌ సిన్హా ప్రసంగం ఉంటుంది. తన పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా సిన్హా కలిసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా కేటీఆర్‌తో భేటీ అనంతరం మంత్రులు, ఇతర నేతలు జల విహార్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.

మరిన్ని వార్తలు