వైఎస్సార్‌ రెండిస్తే.. నేను నలభై చేసిన

29 Sep, 2022 08:34 IST|Sakshi
పుంగనూరు గోసంతతితో.. రామదాసు తన్మయం.. 

అది 2005, జూన్‌ 2. సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పశుసంవర్థక శాఖపై ఉన్నతస్థాయి సమావేశం. ఏపీ డెయిరీ ఉద్యోగి రామదాసు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు రెడీ చేసుకున్నాడు. నిర్ణీత సమయం కంటే ఓ రెండు నిమిషాల ముందే వైఎస్‌ హాల్లోకి వచ్చారు. అధికారులెవరూ అప్పటికి రాకపోవటంతో రామదాసు భయపడుతూనే వైఎస్‌ వద్దకు వెళ్లి నిలుచున్నాడు.

ఆయన ఏంటీ అనగానే.. సర్‌ నాకో ఆవు కావాలి అన్నాడు. దీంతో.. ఏమయ్యా అందరూ ఏదో పదవి కావాలనో, పోస్టింగ్‌ కావాలనో అడుగుతారు..నువ్వేంటి ఆవు కావాలంటున్నావు? అంటూ పకపకా నవ్వారు వైఎస్‌. అయినా నాకు పుంగనూరు ఆవు, కోడె ఇప్పించండి అని రామదాసు ధైర్యంగా అడిగాడు. ఇంతలో అధికారులు రావడంతో రామదాసు ఆశ వదులుకున్నాడు. కానీ భేటీ ముగిసిన తర్వాత సీఎస్‌ మోహన్‌కందాను పిలిచిన సీఎం వైఎస్‌..ఇతనికి ఒక పుంగనూరు ఆవు, కోడె ఇవ్వండి అంటూ రామదాసును చూపించారు.

అలా పుంగనూరు ఆవు, కోడె రామదాసుకు దక్కాయి. తొలుత హైదరాబాద్‌ ఉప్పల్‌లోని తన ఇంట్లోనే వాటిని పెంచాడు. ఇప్పుడు వాటి సంతానం నలభైకి చేరింది. రామదాసు గోశాల యాదాద్రి జిల్లా మర్యాలకు మారింది. ఈ విధంగా పుంగనూరు గోవును రేపటి తరానికి అందించే కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రామదాసు చెప్పాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం పుంగనూరు ఆవు పాలతో అభిషేకం జరుగుతున్న రీతిలో.. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి కూడా పుంగనూరు పాలతో నిత్యాభిషేకం చేయాలన్నది తన ఆకాంక్ష అని తెలిపాడు. 

మరిన్ని వార్తలు