కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు

17 Aug, 2023 11:58 IST|Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్‌.కొత్తపల్లికి చెందిన జి.స్వప్నకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్‌ చేసి కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఆమె డెలివరీ కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఎంసీహెచ్‌ ప్రత్యేక విభాగంలో ఆమెకు సిజేరియన్‌ చేశారు. అనంతరం ఆరోగ్యంగా తల్లీబిడ్డ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆమెకు కడుపులో తీవ్రంగా నొప్పి రావటంతో ఈ నెల 8న ఏలూరు జీజీహెచ్‌లో జనరల్‌ వైద్యుల వద్దకు వచ్చింది.

వైద్యులు ఎక్స్‌రే తీయించగా..ఆమె కడుపులో ఫోర్‌సెప్స్‌ (ఆపరేషన్‌ చేసినప్పుడు ఉపయోగించే వస్తువు)ను మరిచిపోయి కుట్లు వేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేయగా.. అక్కడ స్వప్నకు ఆపరేషన్‌ చేసి పరికరాన్ని బయటకు తీశారు.

ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉంది. స్వప్న కడుపులో ఫోర్‌సెప్స్‌ పరికరం ఉన్నట్లు తెలిపే ఎక్స్‌రేను హాస్పిటల్‌లోని ఓ ఉద్యోగి సోషల్‌ మీడియాలో ఉంచాడు. స్వప్న కడుపులో ఫోర్‌సెప్స్‌ పరికరాన్ని ఉంచి కుట్లు వేసిన ఘటనపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆదేశాలతో విచారణ కమిటీ వేసినట్లు ఏలూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శశిధర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు