గ్రంథాలయాల వైపు.. చిన్నారుల చూపు | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల వైపు.. చిన్నారుల చూపు

Published Sat, Nov 18 2023 2:06 AM

- - Sakshi

భీమవరం: విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించడం ద్వారా వారిలో విజ్ఞాన సముపార్జనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతీ ఆదివారం చదువంటే మాకిష్టం, ప్రతీ నెల మొదటి శనివారం మనం–మన గ్రంథాలయం కార్యక్రమాలతో పాటు వేసవి, దసరా సెలవుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. వీటితో గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గ్రంథాలయ అధికారులు అంటున్నారు. విద్యార్థులు, పాఠకుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు 56వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 76 వరకు గ్రంథాలయాలు ఉన్నాయి. ఏలూరులో కేంద్ర గ్రంథాలయం ఉండగా, గ్రేడ్‌–1 ఐదు, గ్రేడ్‌–2 ఒకటి, గ్రేడ్‌–3 గ్రంథాలయాలు మూడు ఉన్నాయి.

పఠనాశక్తి పెంపొందించేందుకు..

ప్రస్తుతం చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు వ్యసనంగా మారుతున్నాయి. ఖాళీ దొరికితే చాలు పుస్తకాలు పక్కనపెట్టి సెల్‌ఫోన్‌లో మునిగిపోతుంటారు. పుస్తకపఠనం పట్ల ఆసక్తిని కలిగించి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతీ ఆదివారం విద్యార్థులతో చదువంటే మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను రప్పించి వారికి తెలుగు నేర్పడం, కథలు చదివించడం, పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికరంగంలో రాణించినవారి జీవిత చరిత్ర పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రతీ నెల మొదటి శనివారం మనం–మన గ్రంథాలయం కార్యక్రమం అమలుచేస్తున్నారు. పుస్తకాలపై బూజు దులపడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చేస్తున్నారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా 32 రోజుల పాటు వేసవి శిక్షణను ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పుస్తకాలను చదివించడం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు ఏర్పాటుచేయడం, చెస్‌, క్యారమ్స్‌ తదితర ఆటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని గ్రంథాలయాల డిజిటలైజేషన్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన అన్ని స్టడీ మెటీరియల్స్‌, న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. ఏలూరు జిల్లా గ్రంథాలయంలో డిజిటలైజేషన్‌ పూర్తి కాగా గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 గ్రంథాలయాల్లో గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్‌కు చర్యలు తీసుకుంటున్నారు. నర్సాపురంలో రూ. 1.28 కోట్లు, తణుకులో రూ. 1.03 కోట్లుతో గ్రంథాలయాల నూతన భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. నర్సాపురంలో ఇప్పటికే పునాది దశ వరకు పనులు పూర్తయ్యాయి. రీడర్‌ ఆన్‌ డిమాండ్‌ పేరుతో పుస్తకాలు కూడా సరఫరా చేస్తున్నారు.

ఘనంగా గ్రంథాలయాల వారోత్సవాలు

ఏటా నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహి స్తుంది. వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఔత్సాహికులకు జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, కథలు, ఆటలు, క్విజ్‌, పాటలు, డ్యాన్సులు తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. ముగింపు వేడుకల్లో ఆయా పోటీల్లోని విజేతలకు జ్ఞాపికలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. గత వేసవిలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు, గ్రంథాలయ వారోత్సవాలకు ప్రభుత్వం సుమారు రూ. 20 లక్షలు వరకు నిధులు మంజూరు చేసింది.

పఠనాసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి

జిల్లాలోని గ్రంథాలయాలకు రూ. 56 లక్షల విలువైన పుస్తకాలు

ప్రతీ ఆదివారం విద్యార్థులతో ‘చదువంటే మాకిష్టం’

వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు

ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి

గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. నిరుద్యోగుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నాం. వీటిని ఉపయోగించి చాలా మంది గ్రూప్‌–1, గ్రూపు–2, సివిల్స్‌ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

– శేఖర్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, ఏలూరు

1/1

Advertisement
Advertisement